
ఇంటర్నెట్ డెస్క్: కెరీర్ ప్రారంభంలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను నటి తాప్సీ (Taapsee Pannu) తాజాగా వెల్లడించారు. స్పష్టమైన కారణం లేకుండానే పలుమార్లు తనను సినిమాల నుంచి తప్పించారని ఆమె తెలిపారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన తాప్సీ.. పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
‘‘ఒకసారి నేను నటించాల్సిన ఓ సినిమా నుంచి నన్ను ఆఖరి నిమిషంలో తప్పించారు. ఎందుకని అడిగితే.. ‘హీరో భార్యకు నువ్వు నచ్చలేదు’ అని చెప్పారు. ఆ మాట విని నేను షాకయ్యా. సినిమా నుంచి తనను తొలగించడానికి చెప్పిన కారణాల్లో అదే అత్యంత దారుణమైనది. మరో సినిమా నుంచి హీరోనే నన్ను తొలగించారు. బహుశా ఆయనకి ఇంకెవరితో అయినా కలిసి నటించాలని ఉండొచ్చు. కానీ, నాకు సరైన కారణం మాత్రం చెప్పలేదు. ఇక, బాలీవుడ్‌లో ఒక చిత్రం నుంచి నన్ను తప్పించిన విషయం నాకంటే ముందు మీడియాకే తెలిసింది. ఆ తర్వాత చిత్రబృందం నుంచి నాకు ఫోన్ చేసి సారీ చెప్పారు. కానీ, కారణం ఏంటో మాత్రం చెప్పలేదు’’ అని తాప్సీ వెల్లడించారు.
కెరీర్ మొదట్లో బోల్డ్ సీన్స్ చేయడం గురించి తనకు పెద్దగా అవగాహన ఉండేది కాదని తాప్సీ తెలిపారు. ‘‘షూటింగ్ సమయంలో ఇదంతా సాధారణమే అనిపించేది. పరిశ్రమలో నేను కొత్త కావడంతో, అందరూ ఇలాగే చేస్తారని భ్రమపడ్డా. కానీ, తెరపై సినిమా చూశాకే నన్ను అవసరం లేకపోయినా అలా చూపించారని తెలిసేది. బోల్డ్ సీన్స్ లేకుండా కూడా సినిమాలో గ్లామర్‌గా కనిపించొచ్చని అప్పుడు అర్థమయింది’’ అని ఆమె చెప్పుకొచ్చారు. ఇక, తాప్సీ సినిమాల విషయానికొస్తే.. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘గాంధారి’ (Gandhari) సెప్టెంబరు 3న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది.













Leave a Reply