Irumudi Review: ఇరుముడి.. సాయికుమార్‌ పాత్రను అలా ముగించి ఉంటే బాగుండేదేమో


ఇంటర్నెట్‌డెస్క్‌: రూ.35 కోట్లతో తీసిన మూవీ రూ.300 కోట్లకు (Irumudi Movie Collection) పైగా వసూళ్లు సాధించడం మామూలు విషయం కాదని, సినిమా అంటే ‘ఇరుముడి’లా (irumudi movie telugu) ఉండాలన్నారు ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ. (Paruchuri Gopala Krishna) ‘పరుచూరి పలుకులు’ పేరుతో ఆయన కొత్త సినిమాలను తనదైన శైలిలో విశ్లేషించడం, తనదైన అనుభవంతో సినిమాలో లోటుపాట్లను చెబుతున్న విషయం తెలిసిందే. తాజాగా ‘ఇరుముడి’పై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

‘‘సినిమా అంటే ‘ఇరుముడి’లా ఉండాలి. పెట్టిన పెట్టుబడికి పది రెట్లు లాభం వచ్చింది. ఏ నిర్మాత అయినా సరే, రూపాయికి రూపాయి రావాలని భావిస్తారు. దాని తర్వాత ఇంకో సినిమా తీయడానికి మరో రూపాయి వస్తే చాలనుకుంటారు. 300లకు పైగా సినిమాలకు పనిచేసిన అనుభవంలో నిర్మాతల ఆశలు, ఆశయాలు ఏంటో మాకు తెలుసు. రవితేజ (Ravi Teja) గారికి ఇది నిజమైన విజయం. ఇందులో తండ్రీ కూతుళ్ల ప్రేమను చూస్తే, మేం చేసిన ‘సర్పయాగం’ గుర్తొచ్చింది. కుమార్తెకు జరిగిన అన్యాయానికి తండ్రి ఎలా పగ తీర్చుకున్నాడన్నది మూల కథ. ‘ఇరుముడి’ టైటిల్‌ వినగానే ఇదేదో భక్తిభావంతో కూడిన సినిమా అని ప్రేక్షకుడు థియేటర్‌ వెళ్లాడు. ఇలాంటి టైటిల్‌ పెట్టడం కూడా అద్భుతమైన నిర్ణయం’’

‘‘సినిమా ప్రారంభమైన కొద్దిసేపటికే విలన్‌ ఎవరో నాకు తెలిసింది. రచయిత ఎలా మాయ చేస్తాడో మాకు బాగా తెలుసు. చివరి వరకూ టీచర్‌ పాత్రను కొనసాగిస్తూ ప్రేక్షకుడిని తప్పుదోవ పట్టించారు. ఆ అమ్మాయి వెనుక ఒకడున్నాడన్న విషయం సగటు ప్రేక్షకుడికి తెలియదు. స్కూల్‌కు వెళ్లే ఆడపిల్లల్ని ఆటపట్టిస్తూ ఏడిపించే బ్యాచ్‌లు ప్రతి చోటా కనిపిస్తాయి. గంజాయి బ్యాచ్‌ను పెట్టి, ఎమ్మెల్యే పాత్ర చివరి వరకూ తెలియకుండా దర్శకుడు శివ నిర్వాణ (irumudi movie director) మాయ చేశాడు. సెంటిమెంట్‌ మూవీ కావడంతో ఎక్కువ మంది మహిళా ప్రేక్షకులు చూసి ఉంటారు. తండ్రీ కూతుళ్ల మధ్య అనుబంధం తెరపై అద్భుతంగా ఆవిష్కరించాడు’’

‘‘సాయికుమార్‌ పోషించిన గురుస్వామి పాత్ర ఆ చిన్నారిని అంతం చేస్తుంది. అలాగని క్రూరంగా చంపినట్టు చూపించలేదు. మెడ గట్టిగా నొక్కితే చనిపోయిందా? భయంతో చనిపోయిందా? అర్థం కానట్లు మేనేజ్‌ చేశారు. ఎందుకంటే సాయికుమార్‌ పాత్ర ఇరుముడి ఎత్తే గురుస్వామి కాబట్టి, ఆ వ్యక్తి చేతులతో చంపేస్తే బాగుండదని అలాంటి ట్రీట్‌మెంట్‌ ఇచ్చినట్లున్నారు. చివరి అరగంట ఈ సినిమాకు బలం. స్క్రీన్‌ప్లే ఉత్కంఠతో సాగుతుంది. ఇలాంటివి దాసరి నారాయణరావు గారి సినిమాల్లో ఉంటాయి. సినిమా అంతా చూసిన తర్వాత నాకు అనిపించిన కొన్ని అభిప్రాయాలను పంచుకుంటున్నా. ‘సాయికుమార్‌ పాత్రను అలా ముగించడం కరెక్టేనా’ అనిపించింది. గురుస్వామి కాబట్టి, తప్పుచేశానన్న భావనతో ఆయనే ఆత్మహత్య చేసుకుని ఉంటే బాగుండేదేమో! అలాగే, అజయ్ ఘోష్‌ పాత్ర పరివర్తన సరిపోతుందా?అని కూడా అనిపించింది. అతడు కూడా జైలుకెళ్లి వచ్చి ఉంటే ఇంకా బాగుండేదేమో! అయితే, చిన్నారి పాడె మోసినట్లు చూపించడం కూడా ఓకే’’

‘‘ఇక చివరిలో హీరో గురుస్వామి అయిన తర్వాత మణికంఠే వచ్చినట్లు చూపించారు. త్రినాథ్‌స్వామి చూసినంతసేపు మణికంఠగానే ఉండాలి కానీ, ఇటు తిరిగిన తర్వాత అసలు అమ్మాయి రూపం చూపిస్తే బాగుండేది. లేదా ఇదంతా భ్రమ అనేలా త్రినాథ్‌ స్వామి అనుకునేట్లు తీయాల్సింది. హీరో హత్యలు చేస్తే చూస్తారా? అని చాలా మంది అనుకుంటారు. కథకు అవసరమైతే ఏదైనా చూస్తారు. ప్రేక్షకులను మనం తక్కువ అంచనా వేయొద్దు. వాళ్లు మనకంటే చాలా తెలివైన వాళ్లు. ఏడాది, రెండేళ్లు కష్టపడిన చేసిన సినిమా అలా చూసి వెళ్లిపోతే, ప్రేక్షకుడికి నష్టం ఏమీ ఉండదు. మహాఅయితే, టికెట్‌ డబ్బులు పోతాయి.. అంతే! సినిమా వాళ్లకు రూ.కోట్లలో వెళ్లిపోతాయి. అందుకని కొత్తగా కథలు రాసేవారు ప్రతి విషయాన్నీ గుర్తు పెట్టుకుని సినిమాలు తీయాలి’’ అని పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. ‘ఇరుముడి’ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *