Vijayadashami: నవ రూపాలు… నేర్పేవెన్నో | even-though-the-goddess-is-worshipped-in-various-forms-across-different-regions


విశాల భారతదేశం మనది. విభిన్న భాషాసంస్కృతులకు ఆలవాలం. నవరాత్రులలో అమ్మవారిని వివిధ ప్రాంతాల్లో భిన్న రూపాల్లో పూజించినా… అంతిమ లక్ష్యం ఆమె చూపిన మార్గంలో నడవడమే!

శైలపుత్రిని నవరాత్రులలో మొదటి అవతారంగా ఉత్తరాదిన పూజిస్తారు. శివుడిని వివాహమాడాలనే స్థిర నిర్ణయంతో, నిష్కల్మష భక్తితో, ఓర్పుతో తపోదిశగా తన మార్గాన్ని మార్చుకున్న తల్లి. ఈమెను పూజించటం వల్ల మనమూ స్థిరమైన నిర్ణయాలు తీసుకోగలిగే శక్తిని పొందవచ్చు. దక్షిణాదిన భండాసురుణ్ణి సేనాసహితంగా వధించిన తొమ్మిదేళ్ల బాలికని బాలా త్రిపుర సుందరిగా పూజిస్తారు. దుష్టశక్తులపై విజయం సాధించి, కష్టాలు తొలగించే తల్లిగా భావిస్తారు. ఆనందకరమైన వైవాహిక జీవితం కోసం కన్యలు ఈమెను పూజిస్తారు. సంపద, శ్రేయస్సు, మనశ్శాంతి, జ్ఞానాలను ప్రసాదిస్తుందని నమ్ముతారు.

బ్రహ్మచారిణి… ఉత్తరాదిన అమ్మవారిని కొలిచే రెండో రూపమిది. శివుడిని వివాహమాడటానికి ‘బ్రహ్మచారిణి’ తపస్సు చేయదల్చితే కూతురి నిర్ణయాన్ని మార్చడానికి విఫలయత్నం చేశారు మేనకా హిమవంతులు. కానీ అమ్మవారు మాత్రం దృఢ సంకల్పంతో స్వామిని గెలుచుకున్నారు. సోమరితనం, అహంకారం, అసూయ వంటి ప్రతికూల భావనలను దూరంగా ఉంచడానికి అమ్మను ఆశ్రయిస్తారు. ఆ తల్లి పట్టుదల, క్రమశిక్షణ, పనిపట్ల తనకున్న అంకిత భావం మనకూ అనుసరణీయం. దక్షిణాదిన మాత్రం జ్ఞానానికి అధిదేవత గాయత్రీదేవిని కొలుస్తారు. జ్ఞాన సాధనకు అడ్డువచ్చే అవరోధాలను దూరం చేసి, వివేకాన్ని ప్రసాదించటంలో గాయత్రీ మాతది అందెవేసిన చేయి.

నవరాత్రులలో మూడో రూపంగా వెలసింది చంద్రఘంట. గడ్డు పరిస్థితుల్లోనూ చెదరని ఆత్మవిశ్వాసాన్నివ్వడం అమ్మవారి ప్రత్యేకత. కుటుంబ రక్షణకూ ఆలంబన ఇస్తుంది. సృష్టిలోని సమస్త జీవులకీ ఆహారాన్ని అందించే అన్నపూర్ణని దక్షిణాదిన మూడో అవతారంగా పూజిస్తారు. ఒకప్పుడు ఆహారాన్ని తృణీకరించిన కొందరిని మార్చడానికి అమ్మవారు ప్రకృతి మాతగా పాడిపంటలను స్తంభింపచేసిందట. ఆహారంలేక జీవకోటి అల్లాడుతోంటే భిక్షార్థిగా ఆమె ముంగిట అడుగుపెట్టాడు శంకరుడు. అలా ఉదయించిన అన్నపూర్ణ అవతారం సమస్త భక్తావళికి ఆహార ప్రదాత. కుటుంబ శ్రేయస్సు పరిఢవిల్లటానికి అనుబంధాలు బలపడటానికి ఆత్మీయతతో కూడిన ఆహార విలువను తెలియజేసిన రూపమే అన్నపూర్ణాదేవి.

చిరునవ్వుతో అండపిండ బ్రహ్మాండాలను సృష్టించిన కూష్మాండ దేవి ఉత్తరాదిన నాలుగో అవతారం. ఈ తల్లిని పూజిస్తే మానసికారోగ్యం కుదుట పడుతుందని భక్తుల విశ్వాసం. ప్రతిదానిలో స్పష్టత ఏర్పడి, తద్వారా జీవితంలో విజయం సిద్ధిస్తుందనీ నమ్ముతారు. దక్షిణాదిన మహాచండీ దేవిని కొలుస్తారు ప్రజలు. తద్వారా ధైర్యం, ఆరోగ్యం, సంపద లభిస్తాయని భావిస్తారు.

ఉత్తరాది అయిదో అవతారం స్కందమాత. కుమారస్వామిని ఒడిలో కూర్చోబెట్టుకుని సాక్షాత్కరించే అమ్మవారు… మంచి సంతానాన్ని ప్రసాదించడమే కాదు… వాళ్లని సంరక్షించుకోవడానికి అవసరమైన ధైర్యాన్నీ, సంపదనూ ఇస్తుందని నమ్మకం. స్కందమాత తన పిల్లలను తీర్చిదిద్దే క్రమంలో తల్లి పిల్లలతో తగిన సమయాన్ని గడపాల్సిన అవసరాన్నీ తెలియజేస్తుంది. విశ్వజననిగా, విశ్వపాలనకర్తగా లలితా త్రిపుర సుందరిని దక్షిణాదిన పూజిస్తారు. ప్రతికూల ప్రభావాల నుంచి రక్షణ కలుగుతుందనీ, ఈ అవతారాన్ని పూజిస్తే ఆత్మసాక్షాత్కారం కలుగుతుందనీ భక్తుల భావన.

కాత్యాయనీ దేవి వల్ల శాంతి, ఆనందం, సంతోషకరమైన వైవాహిక జీవితం లభిస్తాయని నమ్ముతారు ఉత్తరాదివాసులు. ఆరో అవతారంగా కొలుస్తారు. ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమైన వారు కాత్యాయని దేవిని ఆశ్రయిస్తే తిరిగి విజయం సాధిస్తారని నమ్ముతారు. దక్షిణాదిన మాత్రం మహాసరస్వతీ దేవిని కొలుస్తారు. సాత్విక రూపమైన అమ్మవారిని సృజనాత్మకతకు మూలదైవంగా… ఆమె వీణ నుంచి వచ్చే కంపనాలు సమస్త విశ్వాన్నీ చేతనంగా ఉంచి సకల భయాలనూ దూరం చేస్తాయనీ నమ్ముతారు.

గాఢ అజ్ఞాన అంధకారాన్ని దూరం చేసే అమ్మ ఏడో అవతారం కాళరాత్రి. అమ్మవారి అత్యంత క్రూరమైన రూపంగా దీనికి పేరు. అమ్మని ఆరాధించడం ద్వారా ప్రతికూలతల నుంచి రక్షణ పొంది, భయంలేని జీవితాన్ని గడపొచ్చనేది ఉత్తరాది భక్తుల భావన. అందం, దయ, కరుణ, విజయం వంశవృద్ధి వంటి ఎన్నో సుగుణాలకు ఆలవాలం మహాలక్ష్మీ దేవి. ఆర్థిక స్థిరత్వం, కుటుంబ రక్షణకి ఈ అమ్మవారిని దక్షిణాదివాసులు పూజిస్తారు.

రాక్షస సంహారంలో అలసిన అమ్మ నల్లగా మారిందట. ఆమెను వేళాకోళమాడటానికి శంకరుడు ‘కాళీ’ (నల్లపిల్ల) అని పిలిచారట. దానికి బదులివ్వడానికి తీవ్ర తపస్సు చేసిన అమ్మ మెరిసే బంగారుమేనితో సాక్షాత్కరించారట. ఆ అవతారాన్నే ఉత్తరాదిన ఎనిమిదో అవతారం మహాగౌరీగా చెబుతారు. అమ్మవారు భయం, పాపాల నుంచి విముక్తినిస్తుందని పెద్దల ఉవాచ. మరోవైపు దక్షిణాదిన దుర్గాదేవిని పూజిస్తారు. నారీశక్తికి ప్రతీకగా నిలిచే అమ్మవారు దీర్ఘకాలిక ఆరోగ్యాన్నీ, శారీరక, మానసిక స్వస్థతను కలిగిస్తుందని భావిస్తారు.

కోరికలను తీర్చే తల్లిగా పరిపూర్ణ శక్తిరూపంగా సిద్ధిధాత్రిని ఉత్తరాదిన తొమ్మిదో అవతారంగా ఆరాధిస్తారు. అమ్మవారు అతీంద్రియ శక్తులు, అంతర్గత శాంతినీ ప్రసాదిస్తుందని నమ్ముతారు. ఇక, దక్షిణాదిన లోక కంటకుడైన మహిషాసురున్ని వధించి… చెడుపై మంచి విజయం సాధించేలా చేయగలరన్నది తొమ్మిదో రూపంగా మహిషాసుర మర్దిని చెప్పే పాఠం. అమ్మను పూజిస్తే ఆత్మశుద్ధీకరణ జరిగి అరిషడ్వర్గాలపై విజయం సాధించగలమని భక్తుల విశ్వాసం.

శ్రీ చక్ర అధిష్ఠాన దేవతగా నెలవైన శ్రీ రాజరాజేశ్వరీ దేవిని దశమినాడు ఉపాసించటంతో నవరాత్రి ఉత్సవాలు ముగుస్తాయి. ఈ తల్లి ఆలోచనలు, కోరికలు, ఇంద్రియ లాలసపై నియంత్రణని ప్రసాదిస్తుంది.

పార్నంది అపర్ణ



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *