రాగి.. బంగారమాయెనే! | India Copper Consumption Hits 2,100 Kilotonnes In FY26 As Infrastructure Push And Auto Sector Recovery Drive Demand, Check Details Inside


India copper demand rises 12percent to 2,100 kilotonnes in FY 26

2025–26లో భారీగా పెరిగిన వినియోగం 

2,100 కిలో టన్నులకు చేరిక 

ఇన్‌ఫ్రా, ఆటో, నిర్మాణ రంగాల్లో డిమాండ్‌

న్యూఢిల్లీ: దేశీయంగా ఆటోమోటివ్, నిర్మాణ, మౌలిక తదితర రంగాల్లో రాగికి భారీ డిమాండ్‌ నెలకొంది. దీనితో 2024–25 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2025–26 ఆర్థిక సంవత్సరంలో వినియోగం 12 శాతం పెరిగి 2,100 కిలోటన్నులకు (కేటీ) చేరింది. ఇంటర్నేషనల్‌ కాపర్‌ అసోసియేషన్‌ ఇండియా (ఐసీఏ ఇండియా) విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 

వీటి ప్రకారం వైర్లు, కేబుల్స్, ట్రాన్స్‌ఫార్మర్లు, మోటర్లతో పాటు ఎలక్ట్రికల్, పారిశ్రామిక రంగాల్లో ఉపయోగించే ఉత్పత్తుల తయారీకి కీలకంగా ఉండే రాగికి 2025 ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో డిమాండ్‌ 1,878 కేటీగా నమోదైంది.  ‘రాగికి డిమాండ్‌ నెలకొనడమనేది దేశీయంగా ఆర్థిక కార్యకలాపాలు వేగవంతమవుతున్న తీరును ప్రతిబింబిస్తుంది. 

మౌలిక రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించేలా సానుకూల పాలసీలు, పారిశ్రామికీకరణ, స్వచ్ఛ ఇంధనాలవైపు మళ్లుతుండటం మొదలైన అంశాల వల్ల రాగికి డిమాండ్‌ మరింతగా పెరుగుతుంది‘ అని ఐసీఏ ఇండియా ఎండీ మయూర్‌ కర్మార్‌కర్‌ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా రాగి వినియోగాన్ని ప్రోత్సహించేందుకు 1959లో ఏర్పాటైన లాభాపేక్షరహిత అంతర్జాతీయ సంస్థ ఇంటర్నేషనల్‌ కాపర్‌ అసోసియేషన్‌ భారత విభాగంగా ఐసీఏ ఇండియా పని చేస్తోంది. కాపర్‌ అలయన్స్‌లో సభ్యత్వం కూడా ఉంది.   

మౌలికం దన్ను.. 
గత ఆర్థిక సంవత్సరంలో అదనపు డిమాండ్‌కి మౌలిక రంగం ప్రధాన చోదకంగా నిల్చినట్లు ఐసీఏ ఇండియా తెలిపింది. మొత్తం కాపర్‌ వినియోగంలో 22 శాతం వాటా ఉండే ఈ రంగంలో డిమాండ్‌ వార్షిక ప్రాతిపదికన 29% మేర పెరిగినట్లు వివరించింది. ఇక 2025 ఆర్థిక సంవత్సరంలో నెమ్మదించిన ఆటోమోటివ్‌ పరిశ్రమ కూడా పుంజుకుంది. 

ప్యాసింజర్‌ వాహనాలు, కమర్షియల్‌ వాహనాలు, ట్రాక్టర్ల అమ్మకాల వృద్ధి దన్నుతో ఈ విభాగంలో రాగి వినియోగం 14% పెరిగింది. డిమాండ్‌లో నాలుగో వంతు వాటా ఉండే నిర్మాణ రంగంలో వినియోగం తొమ్మిది శాతం వృద్ధి చెందింది. ప్రీమియం హౌసింగ్‌ ప్రాజెక్టులు, కమర్షియల్‌ రియల్‌ ఎస్టేట్‌ కార్యకలాపాలు, పట్టణీకరణలాంటి అంశాల కారణంగా బిల్డింగ్‌ వైర్లు, పవర్‌ కేబుల్స్‌ మొదలైన వాటికి డిమాండ్‌ ఏర్పడింది. ప్రస్తుతం ప్రాథమిక దశలో ఉన్న డేటా సెంటర్ల వాటా మొత్తం డిమాండ్‌లో 1% కన్నా తక్కువే ఉంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *