Amaravati: గుంతల దారి.. చింతలు తీరి


వైకాపాకు.. రోడ్ల నిర్మాణమంటే దండగమారి పని

కూటమి ప్రభుత్వం వచ్చాక యుద్ధప్రాతిపదికన మరమ్మతులు

23,379 గుంతల పూడ్చివేత 

ఈనాడు – అమరావతి 

వైకాపా ప్రభుత్వంలో.. : రోడ్డేస్తే ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయా అనేది అప్పటి మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రశ్న. ‘పింఛన్లు ఆపితే రోడ్లన్నీ అద్దాల్లా చేయొచ్చు. ఒక్కనెల పింఛన్‌ ఇవ్వకపోతే ముసలోళ్లు ఒప్పుకొంటారా?’ అనేది రాయలసీమకు చెందిన ఓ ఎమ్మెల్యే వ్యాఖ్య. పింఛన్లు, ఇతర పథకాలు ఇస్తున్నామంటూ అభివృద్ధి పనులకు నాడు చాప చుట్టేశారు. 

పూర్తిగా గుంతలమయమైన ఏలూరు లునానీనగర్‌-బీడీ కాలనీ రోడ్డు, కూటమి ప్రభుత్వం వచ్చాక అద్దంలా తయారైన రహదారి

మరి ఇప్పుడో.. : కూటమి ప్రభుత్వం సంక్షేమాన్ని రెట్టింపు చేసింది. జగన్‌ సర్కారులో పింఛన్‌గా నెలకు రూ.2 వేలిస్తే కూటమి ప్రభుత్వం రూ.4 వేల చొప్పున ఇస్తోంది. అలాగని రహదారుల నిర్మాణం, మరమ్మతులను విస్మరించలేదు. జగన్‌ హయాంలో గుంతలమయం చేసిన రహదారులకు మరమ్మతులు చేశారు. కొత్త రహదారుల పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు చంద్రబాబు చేస్తోంది.. అప్పుడు జగన్‌ ఎందుకు చేయలేకపోయారు? 

రహదారులు అభివృద్ధికి చిహ్నాలు.. అవి బాగుంటేనే పెట్టుబడులొస్తాయి. పరిశ్రమలు ఏర్పాటవుతాయి. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. కానీ మాజీ సీఎం జగన్, ఆయన పార్టీ నేతలకు రహదారుల నిర్మాణం ఓ దండగమారి వ్యవహారం. అందుకే ఐదేళ్ల పాలనలో రోడ్ల మరమ్మతుల సంగతే పట్టించుకోలేదు. కాంట్రాక్టర్లకు బిల్లులూ చెల్లించలేదు. ఫలితంగా వారు టెండర్లనే బహిష్కరించారు. అధికారం నుంచి దిగిపోయేనాటికి పట్టణ ప్రాంత రహదారుల్లో.. 23,379 గుంతలు పడేలా నిర్లక్ష్యం వహించడమే జగన్‌ ఘనత! పింఛన్లు, ఇతర సంక్షేమ పథకాలు అమలుచేస్తే రోడ్లు బాగుచేయనక్కర్లేదనేది వారి నైజం. రోడ్లపై నడవ లేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్న ప్రజల్ని.. సంక్షేమం అందిస్తున్నాం చాలదా.. అంటూ ఈసడించుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక యుద్ధప్రాతిపదికన పట్టణాల్లో గుంతల పూడ్చివేత కార్యక్రమం చేపట్టింది. 9 నెలల్లోనే 95% గుంతల్ని పూడ్చివేసింది.

కూటమి ప్రభుత్వంలో.. తొలి 6 నెలల్లోనే

కూటమి అధికారంలోకి రాగానే పట్టణ రహదారులపై దృష్టి సారించింది. మరమ్మతులకు నిధులు కేటాయించింది. గుర్తించిన 23,379 పనుల్లో ఆరునెలల్లోనే 53.5% పూర్తిచేసింది. మరో మూడు నెలల్లో 95% పైగా రహదారుల్లో గుంతలు పూడ్చే పనులు చేసింది. 

  • పురపాలక సాధారణ నిధుల నుంచి ఏడాదికి రూ.20 కోట్ల వరకు గుంతలు పూడ్చేందుకే ఖర్చు చేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఈ ఏడాది మొత్తం 14,118 గుంతలు గుర్తించగా.. 11,074 పూడ్చారు. 
  • హ్యామ్‌ విధానంలో రూ.5,500 కోట్లతో పట్టణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. 

2014-19 మధ్య తెదేపా ప్రభుత్వంలో..

2014-19 మధ్య తెదేపా ప్రభుత్వం పట్టణ రహదారుల నిర్మాణం, మరమ్మతులకు ప్రాధాన్యమిచ్చింది. 2,772 కి.మీ కొత్త  రహదారులు నిర్మించారు. 2019 ఎన్నికల నాటికి సీఐఐపీ (క్రిటికల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌) ఫేజ్‌-1 కింద రూ.2,312 కోట్లతో 3,594 కి.మీ రహదారులు వేశారు. ఫేజ్‌-2 కింద రూ.1,214 కోట్లతో 1,888 కి.మీ రహదారుల నిర్మాణ పనుల్ని పట్టాలెక్కించారు. 14వ ఆర్థికసంఘం, రాష్ట్ర ఆర్థికసంఘం, ఉప ప్రణాళిక నిధుల నుంచి  రూ.1,986 కోట్లతో రహదారులు, కాలువలు నిర్మించారు. సాధారణ ప్రణాళిక నిధుల నుంచి రూ.2,200 కోట్లు, కార్పొరేషన్ల సొంత నిధుల నుంచి రూ.2,100 కోట్లు ఖర్చుపెట్టారు.


2019-24 మధ్య వైకాపా పాలనలో..

2019లో వైకాపా అధికారంలోకి వచ్చేనాటికి రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో రహదారుల విస్తీర్ణం 18,483 కి.మీ. ఆ పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ కొత్త రోడ్ల ఊసే లేదు సరికదా.. ఉన్నవి గుంతలమయమయ్యాయి. వైకాపా అధికారంలోకి వచ్చాక.. అంతకుముందు తెదేపా హయాంలో పట్టాలెక్కించిన రహదారుల నిర్మాణాన్నీ మూలన పెట్టింది. గుంతలు మోకాల్లోతుకు చేరినా తట్టెడు మట్టి పోయలేదు. 

  • మొత్తం 25 జిల్లాల పరిధిలోని పురపాలక సంఘాలు, నగర పంచాయతీలు, కార్పొరేషన్లలో రహదారులకు 23,379 గుంతలు ఏర్పడ్డాయి. 
  • ఆటోలు పాడవుతున్నాయని, ప్రమాదాలు జరుగుతున్నాయని డ్రైవర్లు చెప్పినా అప్పటి సర్కారు చెవికెక్కలేదు. 
  • ప్రజలు, ప్రతిపక్షాల నుంచి పెద్దఎత్తున నిరసనలు వ్యక్తం కావడంతో అప్పటి సీఎం జగన్‌.. సమీక్ష సమావేశాలు పెట్టి రోడ్ల మరమ్మతులు పూర్తిచేయాలని చెప్పారు. కానీ వాటికి నిధులు విదల్చలేదు. 
  • 2021, 2022 సంవత్సరాల్లో గుంతల పూడ్చివేతకు రూ.120 కోట్లు, రూ.180 కోట్లు కేటాయించినా.. 40% కూడా పనులు పూర్తికాలేదు. బిల్లులు చెల్లించకపోవడమే దీనికి కారణం. 
  • 14వ ఆర్థిక సంఘం నిధుల్లో సుమారు రూ.1,400 కోట్లు విద్యుత్తు బకాయిలకు మళ్లించారు. 
  • 2024 నాటికి మున్సిపల్‌ ఇంజినీరింగ్‌ శాఖలో కాంట్రాక్టర్లకు బకాయిలు రూ.1,800 కోట్లకు చేరాయి. దీంతో వారు టెండర్లను బహిష్కరించారు.

రోడ్‌ డాక్టర్‌.. నిమిషాల్లోనే గుంతల పూడ్చివేత

 

విజయవాడ శివారు తాడిగడప మున్సిపాలిటీలో కానూరు-ఎనికేపాడు రహదారి నాటి దుస్థితి

గుంతల రహదారుల్ని బాగుచేసేందుకు కూటమి ప్రభుత్వం రోడ్‌ డాక్టర్‌ వాహనాన్ని అందుబాటులోకి తెచ్చింది. దెబ్బతిన్న రోడ్డు ఉపరితలాన్ని వేడి చేసి, ప్యాచ్‌ వేసి రోలింగ్‌ చేసేందుకు ఇన్‌ఫ్రారెడ్‌ గుంతల (బీటీ ప్యాచ్‌) మరమ్మతు యంత్రాలను వినియోగిస్తున్నారు. ఈ విధానంలో వాహనంతోపాటు కంకర, తారు, నిపుణులైన సిబ్బందిని ఉపయోగించి గుంతలు పూడ్చడం కాంట్రాక్టర్‌ బాధ్యత. రెండు మీటర్ల పొడవు, ఒక మీటరు వెడల్పు ఉన్న గుంతల్ని 45-60 నిమిషాల్లో పూడ్చవచ్చు. 2025 సెప్టెంబరు నుంచి ఆరు యంత్రాలతో 16,918 చ.మీ. విస్తీర్ణంలో 8,457 గుంతలకు మరమ్మతులు చేశారు. ఇలా గుంటూరులో 3,290, తిరుపతిలో 1,872, తాడేపల్లి-మంగళగిరిలో 1,233, కాకినాడలో 1,107, విజయవాడలో 580, రాజమహేంద్రవరంలో 375 గుంతలు పూడ్చారు.

కూటమి ప్రభుత్వ హయాంలో  అదే రహదారిపై వాహనాల పరుగులు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *