వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ఆయుష్, అల్లోపతి ఆసుపత్రులు, కళాశాలల భవన నిర్మాణాల కోసం రూ.221.67 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఏపీఎంఎస్ఐడీసీ ద్వారా 12 పనులకు టెండర్లు పిలిచామని, వీటిలో 10 పనులు ఆయుష్ విభాగానికి, రెండు పనులు అల్లోపతి వైద్య విభాగానికి చెందినవి ఉన్నట్లు శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ‘జాతీయ ఆయుష్ మిషన్ కింద ఆరు జిల్లాల్లో 50 పడకల సమీకృత ఆయుష్ ఆసుపత్రులను నిర్మిస్తున్నామని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో రూ.9.98 కోట్లు, పోలవరం జిల్లా రంపచోడవరంలో రూ.10.57 కోట్లు, ఎన్టీఆర్ జిల్లా నందిగామలో రూ.10.52 కోట్లు, గుంటూరు జిల్లా తెనాలిలో రూ.10.50 కోట్లు, మార్కాపురం జిల్లా గిద్దలూరులో రూ.10.58 కోట్లు, తిరుపతి జిల్లాలో రూ.9.99 కోట్ల అంచనా వ్యయంతో వీటిని నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. రూ.49 కోట్ల చొప్పున వెచ్చించి వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులో ప్రభుత్వ యునాని వైద్య కళాశాల, శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాల ఏర్పాటుకు భవన నిర్మాణాలు చేపట్టనున్నట్లు తెలిపారు. విశాఖలోని విమ్స్ ప్రాంగణంలోని ప్రభుత్వ నేచురోపతి, యోగా కళాశాలకు మొదటి అంతస్తు నిర్మాణానికి రూ.9.37 కోట్లు, 50 పడకల సమీకృత ఆయుష్ ఆసుపత్రిలో మూడో అంతస్తు నిర్మాణానికి రూ.3.04 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. పోలవరం జిల్లా చింతూరులోని 50 పడకల సామాజిక ఆసుపత్రిని 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రిగా తీర్చిదిద్దేందుకు రూ.21.99 కోట్లతో పనులు చేపడుతున్నామని తెలిపారు. కాకినాడ జీజీహెచ్లో ఓపీ భవన నిర్మాణానికి రూ.27.13 కోట్లు వెచ్చించనున్నట్లు వెల్లడించారు.












Leave a Reply