
సాక్షి,చెన్నై: ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో, ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ (జీసీసీ) కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను సందర్శించి నగరవ్యాప్త పరిస్థితులపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాత్రంతా కురిసిన భారీ వర్షాల కారణంగా నగరంలోని 35 ప్రాంతాల్లో నిలిచిన నీటిని మోటార్ పంపుల ద్వారా అధికార యంత్రాంగం యుద్ధప్రాతిపదికన తొలగించింది.
అలాగే 22 ప్రాంతాల్లో కూలిన చెట్లను తొలగించి, నగరంలోని మొత్తం 22 అండర్పాస్ సబ్వేలలో ట్రాఫిక్కు ఎటువంటి అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు. భారీ వర్ష సూచన ఉన్నందున అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను సీఎం విజయ్ ఆదేశించారు. వర్షాల వల్ల ప్రభావితమైన లోతట్టు ప్రాంతాల ప్రజల కోసం జీసీసీ 227 తాత్కాలిక పునరావాస కేంద్రాలను, ఆహార తయారీకి 112 కేంద్రీకృత వంటశాలలను సిద్ధంగా ఉంచింది.
నీట మునిగిన ప్రాంతాల్లోని దాదాపు 13,500 మందికి ఆహార పంపిణీ చేశారు. సహాయక చర్యల కోసం కార్పొరేషన్ సొంత పంపులు, అద్దె పంపులు, ట్రాక్టర్ ఆధారిత పంపులతో సహా మొత్తం 1,189 వాహనాలు, భారీ యంత్రాలను రంగంలోకి దించారు. లోతట్టు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు జీసీసీ తరఫున 36 బోట్లు, మత్స్యశాఖ ఆధ్వర్యంలో 97 బోట్లను అప్రమత్తం చేశారు. రోడ్లపై పడే చెట్లను ఎప్పటికప్పుడు తొలగించేందుకు వందలాది పవర్ సా యంత్రాలను అందుబాటులో ఉంచారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని సీఎం అధికారులకు సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జీసీసీ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాతావరణ శాఖ చెన్నై, తిరుచిరాపల్లి, కోయంబత్తూరు, నీలగిరి జిల్లాలకు సోమవారం ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేసింది. ఈ నాలుగు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు. రాష్ట్రంలోని ఉత్తర, పశ్చిమ, మధ్య, దక్షిణ ప్రాంతాల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండనుంది. ధర్మపురి, కృష్ణగిరి, సేలం, తిరువళ్లూరు, దిండిగల్, తేని, విరుదునగర్, తెన్కాశి, తిరునెల్వేలి, కన్యాకుమారి, తూత్తుకుడి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
IMD has warned of very heavy rainfall in Chennai today. SMS Today… 👀 https://t.co/FmrmsolIMO
— Chennai Updates (@UpdatesChennai) October 18, 2026
కావేరి డెల్టా సహా పరిసర ప్రాంతాలైన మదురై, రామనాథపురం, శివగంగ, పుదుక్కోట్టై, తంజావూరు, నాగపట్నం, కడలూరు, చెంగల్పట్టు, కాంచీపురం, వెల్లూరు జిల్లాల్లోనూ జోరువానలు కురుస్తాయని పేర్కొంది. పశ్చిమ జిల్లాలైన కోయంబత్తూరు, నీలగిరి ప్రాంతాల్లో వర్ష ప్రభావం మరింత తీవ్రంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. మంగళవారం కూడా వర్షాల జోరు కొనసాగనుంది. మంగళవారానికి సంబంధించి తిరునెల్వేలి, మదురై జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆ రోజున చెన్నై సహా రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 35 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు.














Leave a Reply