తీవ్ర వాయుగుండం.. గంటకు 7.కి.మీ వేగంతో ముందుకు..


అమరావతి: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. గడిచిన 6 గంటల్లో గంటకు 7 కి.మీ వేగంతో పశ్చిమ వాయవ్యదిశగా ముందుకు కదులుతున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది ప్రస్తుతానికి గోపాల్‌పూర్‌కు 150 కి.మీ, కళింగపట్నానికి 100 కి.మీ, ఒడిశాలోని పూరీకి 220 కి.మీ, విశాఖపట్నానికి 180 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు సంస్థ ఎండీ ప్రఖర్‌జైన్‌ తెలిపారు. బుధవారం రాత్రికి విశాఖ-గోపాల్‌పూర్‌ మధ్య తీవ్ర వాయుగుండం తీరం దాటే అవకాశముందన్నారు.

తీవ్రవాయుగుండం ప్రభావంతో 50-70కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముంది. ఉత్తరాంధ్ర జిల్లాలకు ఇప్పటికే రెడ్‌ అలర్ట్‌ జారీ అయింది. ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉండటంతో నదీ పరివాహక ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. తీవ్ర వాయుగుండం కారణంగా ఉత్తరాంధ్రతో పాటు కాకినాడ జిల్లాలో విద్యాసంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. 

మంత్రుల సమీక్ష

తీవ్ర వాయుగుండం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మంత్రులు సమీక్ష నిర్వహించారు. విద్యుత్, రహదారులు, ప్రజా రవాణా వ్యవస్థలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రులు గొట్టిపాటి రవికుమార్‌, గుమ్మడి సంధ్యారాణి, బీసీ జనార్దన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. 

విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడితే యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించేందుకు సిబ్బందిని అందుబాటులో ఉంచాలని.. పడిపోయిన విద్యుత్‌ స్తంభాలు, చెట్లను వెంటనే తొలగించాలని గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో ఈదురుగాలులు వీచే అవకాశముందని.. చెట్లు, కొండచరియలు విరిగిపడే ప్రమాదాలపై ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. రైతులు, మత్స్యకారులు జాగ్రత్తలు పాటించేలా ముందస్తు సమాచారం ఇవ్వాలని సంధ్యారాణి దిశానిర్దేశం చేశారు. 

వాగులు, గెడ్డలు, కాజ్‌వేల వద్ద బారికేడ్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేసి.. అవసరమైతే ప్రమాదకర మార్గాల్లో రాకపోకలు నిలిపివేయాలని బీసీ జనార్దన్ రెడ్డి సూచించారు. జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటుచేసి నిరంతర పర్యవేక్షణ చేపట్టడంతో పాటు జేసీబీలు, రెస్క్యూ బృందాలను సిద్ధంగా ఉంచాలని, అత్యవసర పరిస్థితుల్లో అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని మంత్రులు ఆదేశించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *