ప్రారంభం రోజు వచ్చింది 600 క్వింటాళ్లే

ఆదిలాబాద్ మార్కెట్లోకి వచ్చిన పత్తి వాహనాల వరుస
ఈటీవీ-ఆదిలాబాద్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పత్తి సాగు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఎల్‌నినో ప్రభావంతో పంటల దిగుబడి గణనీయంగా తగ్గింది. ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం కొనుగోళ్లు ప్రారంభంకాగా 30 వాహనాల్లో 600 క్వింటాళ్ల పత్తి మాత్రమే అమ్మకానికి వచ్చింది. గతేడాది అక్టోబరు 24వ తేదీన ప్రారంభం రోజునే ఎనిమిదివేల క్వింటాళ్ల పత్తి అమ్మకానికి వచ్చింది. గతేడాదితో పోల్చుకుంటే 7,400 క్వింటాళ్లు తక్కువగా నమోదైనట్లు మార్కెటింగ్ శాఖ నిర్ధారించింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 10.60 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. ఎకరాకు 8 క్వింటాళ్ల చొప్పున దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. కానీ తొలిరోజు అమ్మకానికి వచ్చిన పత్తిని పరిగణనలోకి తీసుకుంటే ఎకరాకు సగటున 5 క్వింటాళ్లకే పరిమితమయ్యే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.
- మార్కెట్‌యార్డులో తొలుత అదనపు కలెక్టర రాజేశ్వర్, మార్కెటింగ్ శాఖ వరంగల్ డిప్యూటీ డైరెక్టర్ పద్మావతి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి, ఏడీ గజానంద్, రైతు సంఘం ప్రతినిధులు, సీసీఐ అధికారులు, వ్యాపారుల సమక్షంలో వేలం పాట ప్రారంభమైంది.
- ప్రభుత్వ ధర రూ.8,667 ప్రకటించగా ప్రైవేటు ధర రూ. 9,260గా ఖరారైంది.
- కలెక్టర్ రాజర్షిషా, మున్సిపల్, గ్రంథాలయ ఛైర్‌పర్సన్లు అనూష, నర్సయ్య, డీసీసీబీ మాజీ ఛైర్మన్ భోజారెడ్డి యార్డుకు వచ్చారు. వ్యాపారులు, రైతు ప్రతినిధులతో మాట్లాడాక కాంటాకు ప్రత్యేక పూజలు నిర్వహించటంతో కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి.
రైతుల్లో వేదన
అంతర్జాతీయంగా నమోదయ్యే హెచ్చుతగ్గులు, రాష్ట్రంలోని వేర్వేరు యార్డుల్లో నమోదయ్యే ధరల ఆధారంగా ఆదిలాబాద్‌లో తొలిరోజు వేలం నిర్వహిస్తారు.
- గురువారం వరంగల్ జిల్లాలో నమోదైన రూ.9,110 జమ్మికుంటలో రూ. 9,250 పలికిన ధరల ప్రామాణికంగా వ్యాపారులు ఆదిలాబాద్‌లో రూ.9,260 ధర ఖరారు చేశారు.
- మహారాష్ట్రలోని సార్‌ఖనిలో నమోదైన రూ. 9,600ను పరిగణనలోకి తీసుకుంటే కొంత మేలు జరుగుతుందని రైతు సంఘం ప్రతినిధులు దత్తాత్రి, రమేష్, గోవర్ధన్‌యాదవ్, పోశెట్టి పేర్కొనప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
మద్దతు ధరకే సీసీఐ పరిమితం
మద్దతు ధర రూ. 8,667 చొప్పున కొనుగోళ్లకు భారత పత్తి సంస్థ (సీసీఐ) ముందుకొచ్చింది. కానీ బహిరంగ మార్కెట్లో నమోదవుతున్న డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో వ్యాపారుల వేలం ఏకపక్షంగానే సాగింది.













Leave a Reply