
మామిడిగుండాల: భూ రీ సర్వే ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పారదర్శకంగా, కచ్చితత్వంతో విధులు నిర్వహించాలని సూచించారు. శుక్రవారం ఇల్లందు ప్రాంతంలో పర్యటించిన కలెక్టర్.. మామిడి గుండాలలో భూ రీ సర్వే పనులు, జీఓ నం. 76 కింద సింగరేణి భూముల క్రమబద్ధీకరణ దరఖాస్తులకు సంబంధించి చేపట్టిన క్షేత్రస్థాయి సర్వేను పరిశీలించారు. సర్వే పురోగతి, భూముల విస్తీర్ణం, గతంలో జారీ చేసిన పట్టాలు, భూ రికార్డులు, సరిహద్దుల నిర్ధరణకు సంబంధించిన వివరాలను సర్వే సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. గ్రామ పరిధిలోని భూములకు సంబంధించి పాత రికార్డులు, మ్యాప్లను పరిశీలించి, గతంలో పట్టాలు జారీ చేసిన భూముల సరిహద్దులను స్పష్టంగా నిర్ధరించాలని సూచించారు. అటవీ, రెవెన్యూ భూముల హద్దుల విషయంలో సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టాలని ఆదేశించారు.
కలెక్టర్ క్షేత్రస్థాయి పర్యటన సందర్భంగా ఎంపీడీవో, ఏపీఎం అందుబాటులో లేకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ పర్యటనకు సంబంధించిన విధుల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహించరాదని స్పష్టం చేస్తూ, సంబంధిత అధికారులకు మెమోలు జారీ చేయాలని ఆదేశించారు.
అనంతరం ఇల్లందు ప్రాంతంలో పర్యటించిన కలెక్టర్.. సింగరేణి హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను, ఓటరు నమోదు ప్రత్యేక శిబిరాలు ఆకస్మికంగా తనిఖీ చేశారు. నూతన ఓటరు నమోదు కోసం ఫారం-6 ద్వారా స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి, నమోదు ప్రక్రియ పురోగతిని బూత్ స్థాయి అధికారులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ కాశీరాం, జీపీఓ లక్ష్మీకాంత్, మామిడి గుండాల సర్పంచ్ ఎట్టి రమణ, వివిధ శాఖలకు చెందిన అధికారులు సిబ్బంది తదితరులు ఉన్నారు.














Leave a Reply