555 రోజుల ఎఫ్డీ వడ్డీ రేట్ల వివరాలుకెనరా బ్యాంక్ అందిస్తున్న ఈ 555 రోజుల ఎఫ్డీ స్కీమ్ ఇతర సాధారణ ఎఫ్డీలతో పోలిస్తే వినియోగదారులకు అధిక వార్షిక వడ్డీ రేటును అందిస్తుంది. ఈ నిర్దిష్ట కాలపరిమితి గల డిపాజిట్‌పై సాధారణ వినియోగదారులకు 6.60 శాతం వడ్డీ రేటును బ్యాంక్ అందిస్తోంది.
దీని వార్షిక రాబడి సగటు రేటు 6.77 శాతంగా ఉంటుంది. అయితే, సీనియర్ సిటిజన్లకు(వయోవృద్ధులకు) బ్యాంకులు ఎప్పుడూ వడ్డీ రేట్లలో అదనపు ప్రాధాన్యత ఇస్తాయన్న విషయం తెలిసిందే. ఈ స్కీమ్‌లో కూడా సీనియర్ సిటిజన్లకు 7.10 శాతం అధిక వడ్డీ రేటును అందిస్తున్నారు. దీని వార్షిక రాబడి రేటు ఏకంగా 7.29 శాతంగా ఉంటుంది. అంటే, సాధారణ కస్టమర్లతో పోలిస్తే సీనియర్ సిటిజన్లు ఈ ఎఫ్డీపై మెరుగైన రాబడిని సొంతం చేసుకుంటారు.
రూ.లక్ష డిపాజిట్‌పై ఎంత వడ్డీ వస్తుందంటే?
ఈ పథకంలో పెట్టుబడి పెడితే ఎంత రాబడి వస్తుందో ఉదాహరణ ద్వారా అర్థం చేసుకుందాం. మీరు రూ. లక్షతో 555 రోజుల కాలపరిమితికి ఎఫ్డీ చేశారని అనుకుందాం. 6.60 శాతం వడ్డీ రేటు ప్రకారం, సాధారణ వినియోగదారులు సంవత్సరానికి సుమారుగా రూ.6,600 వడ్డీని పొందుతారు. అదే 6.77 శాతం వార్షిక రాబడి సగటు ప్రకారం చూసుకుంటే, ఈ రాబడి సుమారుగా రూ.6,770 వరకు ఉంటుంది.
అదే సమయంలో 7.10 శాతం వడ్డీ రేటు వర్తించే సీనియర్ సిటిజన్లు సంవత్సరానికి సుమారుగా రూ.7,100 వడ్డీ పొందుతారు. 7.29 శాతం వార్షిక రాబడి లెక్కల ప్రకారం వారి రాబడి సుమారుగా రూ.7,290 వరకు ఉంటుంది. వాస్తవ వడ్డీ మొత్తం మీరు డిపాజిట్ చేసిన అసలు మొత్తం , మీరు ఎంచుకున్న వడ్డీ చెల్లింపు విధానం(నెలవారీ, త్రైమాసికం, వార్షికం)పై కూడా ఆధారపడి మారుతూ ఉంటుంది.
రూ.కోటి పైబడిన డిపాజిట్లకు…
ఒకవేళ వినియోగదారుడు కెనరా బ్యాంక్ ఎఫ్డీలో రూ.కోటికి మించిన పెద్ద మొత్తాన్ని జమ చేయాలనుకుంటే, వారి కోసం బ్యాంక్ నాన్ కాల్బుల్ ఎఫ్డీ(Non-Callable FD) ఆప్షన్‌ను కూడా ప్రత్యేకంగా అందిస్తోంది. ఈ భారీ డిపాజిట్లపై సాధారణ వినియోగదారులకు వడ్డీ రేటు సంవత్సరానికి 6.70 శాతం కాగా, వార్షిక సగటు రేటు 6.87 శాతంగా ఉంటుంది.
ఇదే నాన్ కాల్బుల్ ఎంపిక కింద సీనియర్ సిటిజన్లకు సంవత్సరానికి 7.20 శాతం వడ్డీని అందిస్తుండగా, వార్షిక సగటు రేటు 7.40 శాతంగా ఉంటుంది. దీనర్థం.. ప్రామాణిక 555 రోజుల ఎఫ్‌డీతో పోలిస్తే,రూ.కోటికి మించిన భారీ డిపాజిట్లు ఉన్న వినియోగదారులు ఈ నాన్ కాల్బుల్ ఎంపిక కింద కొద్దిగా అధిక వడ్డీ రేట్లను పొందుతారు.
కాల్బుల్, నాన్ కాల్బుల్ ఎఫ్‌డీల మధ్య తేడాలు…
ఎఫ్డీని ఎంచుకునే ముందు కాల్బుల్, నాన్ కాల్బుల్ ఎఫ్‌డీల మధ్య ఉన్న తేడాను అర్థం చేసుకోవాలి. కాల్బుల్ ఎఫ్డీలు అనేవి గడువుకు ముందే అత్యవసర పరిస్థితుల్లో డబ్బును విత్‌డ్రా చేసుకోవడానికి అనుమతిస్తాయి. అయితే, గడువుకు ముందే విత్‌డ్రా చేసుకుంటే బ్యాంక్ నిబంధనలను బట్టి కొంత జరిమానా లేదా వడ్డీలో కోత విధించవచ్చు. మరోవైపు, నాన్ కాల్బుల్ ఎఫ్డీలు సాధారణంగా గడువుకు ముందే డబ్బును విత్‌డ్రా చేసుకునే సదుపాయాన్ని కల్పించవు. కచ్చితంగా మెచ్యూరిటీ వరకు వేచి చూడాల్సిందే. గడువుకు ముందే తీయడానికి వీలుండదు కాబట్టే, వీటి వడ్డీ రేటు సాధారణ ఎఫ్‌డీల కంటే కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల, తమ నిధులను మధ్యలోనే విత్‌డ్రా చేసుకోవాల్సిన అవసరం ఉన్నవారు, ముందుగానే ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి.
పెట్టుబడికి ముందు ఇవి గుర్తుంచుకోండి…
ఎఫ్డీలు ఎంత సురక్షితమైన పెట్టుబడి అయినా, పెట్టుబడి పెట్టే ముందు మీ ఆర్థిక అవసరాలను , కాలపరిమితిని పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. 555 రోజులలోపు ఆ డబ్బు అత్యవసరంగా అవసరం అయ్యే అవకాశం ఉంటే, మధ్యలోనే విరమించుకోవడానికి అవకాశం లేని నాన్ కాల్బుల్ ఎఫ్డీని ఎంచుకోవడం సరైన ఆలోచన కాదు. అంతేకాకుండా, ఎఫ్డీలపై వచ్చే వడ్డీ ఆదాయం ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం పన్ను పరిధిలోకి వస్తుంది.
వడ్డీ పరిమితి దాటితే బ్యాంక్ నేరుగా టీడీఎస్(TDS) మినహాయించవచ్చు. అందువల్ల, పెట్టుబడి పెట్టే ముందు మీ ట్యాక్స్ స్లాబ్ , పన్ను విధింపు విధానాలను పరిగణనలోకి తీసుకోండి. సరైన ప్రణాళికతో పెట్టుబడి పెడితే 555 రోజుల ఎఫ్డీ ఆర్థిక ఆసరాగా నిలుస్తుంది.















Leave a Reply