గప్‌ ‘చిప్‌’గా రైతుల కష్టం దోపిడీ


జిల్లాలో మొదలైన పత్తి, పెసర విక్రయాలు

ఈనాడు-ఖమ్మం, తల్లాడ, న్యూస్‌టుడే

ఎలక్ట్రానిక్‌ కాంటాను ఆపరేట్‌ చేసే రిమోట్‌ 

  • తల్లాడ మండలానికి చెందిన కొందరు దళారులు ఉమ్మడి జిల్లాల్లో తిరుగుతూ పత్తి కొంటున్నారు. రిమోట్‌ నొక్కితే 15-20 కిలోలు తక్కువ తూకం చూపే ఎలక్ట్రానిక్‌ కాంటాలతో రైతులను మోసం చేశారు. గతేడాది పోలీసులు దాడులు జరిపి ఆరుగురిపై కేసులు పెట్టారు. 65 మంది దళారులను బైండోవర్‌ చేశారు.
  • రైతులను మోసగించడానికి ఎలక్ట్రానిక్‌ కాంటాల్లో వాడే చిప్‌లను తయారు చేసే హైదరాబాద్‌కు చెందిన ఇద్దరిని గతేడాది డిసెంబరులో తల్లాడ పోలీసులు పట్టుకున్నారు. మదర్‌బోర్డులు, మోసపూరిత చిప్‌లు, కాంటాలు స్వాధీనం చేసుకున్నారు. 

సులభంగా డబ్బు సంపాదించాలని మాయగాళ్లు అక్రమ మార్గాలను అన్వేషిస్తున్నారు. ప్రధానంగా పత్తి, పెసర విక్రయించే రైతులను ఎలక్ట్రానిక్‌ కాంటాలతో మోసగిస్తున్నారు. తూనికలు, కొలతల శాఖ అధికారులు మార్కెట్లు, దుకాణాల్లోని కాంటాలను తనిఖీ చేస్తూ జరిమానాలు విధిస్తున్నారు. కానీ, దళారులను పట్టించుకోకపోవడంతో వాహనాల్లో పల్లెలను చుట్టుముట్టి చిప్‌లు అమర్చిన ఎలక్ట్రానిక్‌ కాంటాలను రిమోట్‌ ద్వారా ఆపరేట్‌ చేస్తూ కర్షకుల కష్టాన్ని దోచుకుంటున్నారు. 

మూడేళ్లలో రూ.45.18 లక్షల జరిమానా

  • జిల్లాలో ఏటా తూనికలు, కొలతల శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. గతేడాది తూకం యంత్రాలకు వేసే స్టాంపింగ్‌ ద్వారానే రూ.55.16 లక్షలు వచ్చాయి. కాంటాలకు స్టాంపింగ్‌ లేకపోవడం, తూకాల్లో తేడాలు ఉండటం, ప్యాకెట్లపై తుది గడువు ముగిసిపోవడం, లేబుల్‌ లేకపోవడంతో కేసులు నమోదు చేస్తున్నారు. గత మూడేళ్లలోనే తూకం, ప్యాకింగ్‌ లోపాలపై 332 కేసులు నమోదు చేశారు. రూ.45.18 లక్షల జరిమానా విధించారు.
  • ఖమ్మంలోని జిల్లా కార్యాలయంలో జిల్లా అధికారితోపాటు సబార్డినేట్‌ మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల జరిగిన బదిలీలు, ఉద్యోగ విరమణ అనంతరం ఇన్‌స్పెక్టర్, సీనియర్, జూనియర్‌ సాంకేతిక సహాయకుల పోస్టులు ఖాళీలు ఉన్నాయి. సిబ్బంది కొరత కారణంగా తనిఖీలు మందగిస్తున్నాయి. 
  • తూకం మోసాలు జరిగితే రైతులు, వినియోగదారులు 91776 61663 నంబరుకు ఫోన్‌ చేయాలి.

మార్కెట్లలో తనిఖీలు జరుపుతున్నాం

పంట కొనుగోళ్లు మొదలైనందున వ్యవసాయ మార్కెట్లలోని తూకం యంత్రాలను పరిశీలించి స్టాంపింగ్‌ వేస్తున్నాం. ఎనిమిది పత్తి జిన్నింగ్‌ మిల్లుల్లోనూ తనిఖీలు జరిపాం. స్టాపింగ్‌ ఆలస్యమైతే ఆన్‌లైన్‌లోనే జరిమానా జనరేట్‌ అవుతుంది. 

విజయ్‌కుమార్, జిల్లా తూనికలు, కొలతల శాఖ అధికారి 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *