ఎల్‌నినో అతి తీవ్రం కాబోతోందా? | general


దిల్లీ: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఎల్‌నినో వేగంగా బలపడుతోంది. దీనివల్ల చాలా ప్రాంతాల్లో సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రతలు నమోదుకానున్నాయి. ఈ మేరకు ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) గురువారం తెలిపింది. డిసెంబరులో ఎల్‌నినో గరిష్ఠ స్థాయికి చేరుకోనుందని తెలిపింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకూ ఈ వాతావరణ పోకడ కొనసాగడానికి 100 శాతం అవకాశాలు ఉన్నాయని వివరించింది. దీంతో 1950 తర్వాత అత్యంత బలమైన ఎల్‌నినోగా ఇది నిలిచిపోయే అవకాశం ఉందని వివరించింది. మానవ చర్యలతో కలుగుతున్న వాతావరణ మార్పుల ప్రభావాన్ని ఇది తీవ్రం చేస్తుందని తెలిపింది. అక్టోబరు నుంచి డిసెంబరు మధ్య కాలంలో.. ఎల్‌నినోకు కేంద్ర బిందువుగా ఉన్న మధ్య, తూర్పు ఉష్ణమండల పసిఫిక్‌ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో.. సాధారణం కన్నా 3.7 డిగ్రీల సెల్సియస్‌ మేర పెరగొచ్చని పేర్కొంది. 

తాజా పరిణామాలపై ప్రపంచవ్యాప్తంగా వాతావరణ నిపుణులు కూడా ఆందోళన వ్యక్తంచేశారు. నానాటికీ తీవ్రమవుతున్న ఎల్‌నినో వల్ల పసిఫిక్‌ మహా సముద్రంలో నిక్షిప్తమైన ఉష్ణం బయటకు విడుదలవుతుందని పేర్కొన్నారు. దీనివల్ల పుడమిలో చాలా భాగం తీవ్ర ఉష్ణోగ్రతలతో అల్లాడుతుందని పేర్కొన్నారు. ‘‘భూమి దాదాపు ‘ఎర్రగా’ మారింది. శీతాకాలంలో గరిష్ఠ శక్తిని సంతరించుకునే దిశగా ఎల్‌నినో సాగుతోంది’’ అని వాతావరణ శాస్త్రవేత్త ర్యాన్‌ మవీ పేర్కొన్నారు. ఈ వాతావరణ పోకడ కొత్త ప్రాంతాలకూ విస్తరిస్తోందని జెకీ హాస్‌ఫాదర్‌ అనే శాస్త్రవేత్త వివరించారు. పసిఫిక్‌లోని నినో 3.4 అనే ప్రాంతంలో ఉష్ణోగ్రతల్లో వైరుధ్యాలు సాధారణం కన్నా 3.4 డిగ్రీల సెల్సియస్‌ మేర ఉన్నాయని వివరించారు. గతంలో నమోదైన ఏ ఎల్‌నినోలోనూ ఇలాంటి పరిస్థితి లేదని చెప్పారు. మరోవైపు ఇది ‘సూపర్‌ డూపర్‌ ఎల్‌నినో’గా మారనుందని వాతావరణ నిపుణుడు లియోన్‌ సైమన్స్‌ పేర్కొన్నారు. ఎల్‌నినో వల్ల జూన్‌-సెప్టెంబరు మధ్య భారత్‌లో దీర్ఘకాల సరాసరి వర్షపాతంతో పోలిస్తే 87.4 శాతం మేర మాత్రమే వానలు పడ్డాయి. ఈ వాతావరణ పోకడ బలపడుతున్న నేపథ్యంలో దేశ ప్రజలు, పర్యావరణంపై ప్రభావం పడుతుంది. కరవు, అసాధారణ వేడి పరిస్థితులకు ఆస్కారం పెరుగుతుంది. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *