సుభాష్ చంద్రబోస్ సోదరుడు శరత్ చంద్రబోస్ మనవడైన చంద్రకుమార్ బోస్.. ‘ఫౌజీ’ టీజర్ రిలీజైన తర్వాత చిత్ర బృందంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చరిత్రకు కల్పిత కథను జోడించడం నేరమని, ఈ సినిమా మేకర్స్ భారత ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ‘ఫౌజీ’ టీజర్‌ను తొలగించాలని చంద్రకుమార్ తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. చరిత్ర వక్రీకరణకు తావులేని విధంగా కొత్త టీజర్ విడుదల చేయాలని సూచించారు. ”నేతాజీ పాత్రకి సంబంధించి మాకున్న అభ్యంతరాలు పరిష్కారమైతే (టీజర్, సినిమా రెండింటి విషయంలోనూ), ప్రభాస్ మరియు మొత్తం చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు. హను రాఘవపూడి ఈ విషయంలోని తీవ్రతను గుర్తిస్తారని ఆశిస్తున్నాను” అని ఆయన ట్వీట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీని ట్యాగ్ చేస్తూ.. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కి రాసిన లేఖను చంద్రకుమార్ పంచుకున్నారు.
”ప్రభాస్ కథానాయకుడిగా, హను రాఘవపూడి దర్శకత్వంలో రాబోతున్న ‘ఫౌజీ’ అనే చిత్రం టీజర్‌పై చెలరేగుతున్న వివాదం గురించి మీకు ఇప్పటికే తెలిసే ఉంటుంది. నేతాజీ సహచరుడు, విప్లవ నాయకుడు భగవతి చరణ్ పాణిగ్రాహి 83వ బలిదాన్ దివస్ సందర్భాన్ని పురస్కరించుకుని అక్టోబర్ 23న ఈ మూవీ టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్లో ఇండియన్ నేషనల్ ఆర్మీ సుప్రీం కమాండర్, అఖండ భారత తొలి ప్రధాని అయిన నేతాజీ సుభాష్ చంద్రబోస్.. హిట్లర్‌తో మాట్లాడుతూ ‘ఫౌజీ’ అనే కల్పిత పాత్రను పరిచయం చేస్తున్నట్లు చూపించడం జరిగింది. నేతాజీ పాత్రను ఇలా తేలికపరిచి చూపించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇటువంటి అభ్యంతరకరమైన కంటెంట్‌ను సెన్సార్ బోర్డ్ ఎలా క్లియర్ చేసిందో కూడా మాకు అర్థం కావడం లేదు. తీవ్రమైన ఈ అంశాన్ని మీరు పరిశీలించి, తగిన విచారణ జరిపించాల్సిందిగా అభ్యర్థిస్తున్నాము. ఈ టీజర్‌ను వెంటనే తొలగించి, సెన్సార్ బోర్డ్‌లో దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటే అది దేశానికి చేసే సరైన సేవ అవుతుంది” అని అశ్విని వైష్ణవ్ కి రాసిన లేఖలో చంద్రకుమార్ పేర్కొన్నారు.
‘ఫౌజీ’ టీజర్ వివాదం…
సుమారు రెండున్నర నిమిషాల నిడివి ఉన్న ‘ఫౌజీ’ టీజర్.. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో అడాల్ఫ్ హిట్లర్, సుభాష్ చంద్రబోస్ మధ్య జరిగే సంభాషణతో ప్రారంభమవుతుంది. భారత్‌కు స్వాతంత్ర్యం సాధించాలనే తన ఆకాంక్షను నేతాజీ వ్యక్తం చేస్తారు. బ్రిటిష్ వారిపై విజయం సాధించి సింగపూర్‌ను తమ ఆధీనంలోకి తెచ్చుకోవడంలో జపాన్‌కు సహాయపడిన భారతీయ గూఢచారి గురించి నేతాజీ ప్రస్తావిస్తారు. కలకత్తాలో ఉన్న ఆ వ్యక్తే ‘ఫౌజీ’ అని పరిచయం చేస్తూ ప్రభాస్‌ను చూపించారు. సుభాష్ చంద్రబోస్ పాత్రను తక్కువ చేసి చూపించారని, చరిత్రను వక్రీకరించారని చంద్రకుమార్ బోస్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నందిని సత్పతి మనవడు సుపర్ణో సత్పతి సైతం చరిత్రను కల్పిత కథతో కలపడం సరైన పద్ధతి కాదని అభిప్రాయపడ్డారు. సినిమా తరతరాల ప్రేక్షకులపై ప్రభావం చూపుతుందని, నేతాజీని కల్పిత పాత్రకు అనుసంధానించడం చరిత్రను వక్రీకరించినట్లవుతుందని ఆయన వ్యాఖ్యానించారు.














Leave a Reply