
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలోని ఉద్యోగాలు స్వదేశీయులకే దక్కాలన్న లక్ష్యంతో ట్రంప్ సర్కారు వీసా విధానాలను కఠినతరం చేస్తోన్న సంగతి తెలిసిందే. దీనిపై భారత సంతతి సీఈఓ, ‘సర్కిల్ ప్లస్ పే’ వ్యవస్థాపకుడు నితీశ్ కన్నన్ (Nitish Kannan) తాజాగా స్పందించారు. అమెరికన్లకు ఉద్యోగాలు రాకపోతే.. అందుకు హెచ్-1బీ వీసాదారులను (H-1B Visa) నిందించడం సరికాదని అన్నారు. అగ్రరాజ్యంలోని కోట్ల ఉద్యోగాల్లో హెచ్-1బీ వీసాదారులకు ఏటా 85వేల ఉద్యోగాలే ఇస్తున్న విషయాన్ని గుర్తుచేశారు.
‘‘అగ్రరాజ్య కంపెనీలు అమెరికన్లకు (USA) బదులు హెచ్-1బీ వీసాదారులను ఎందుకు నియమించుకుంటున్నాయి. వాస్తవానికి ఏటా 85వేల హెచ్-1బీ వీసాలే జారీ అవుతుంటాయి. అదే సమయంలో అమెరికాలో దాదాపు 55-60లక్షల ఉద్యోగాలు (US Jobs) అందుబాటులో ఉంటున్నాయి. ఒక్క కంప్యూటర్ రంగంలోనే 5లక్షల జాబ్స్ ఉంటున్నాయి. మరోవైపు, ఏటా 50వేల మంది అమెరికన్లు మాత్రమే కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే.. హెచ్-1బీ వీసాదారులకు, అమెరికా గ్రాడ్యుయేట్లకు సరిపడా ఉద్యోగాలు అందుబాటులో ఉన్నట్లే. ఇదిలా ఉండగా.. హెచ్-1బీ వీసాపై ఒకరిని నియమించుకోవడం అనేది చాలా పెద్ద ప్రయాసతో కూడిన పని. అలాగే దానికి భారీగా ఖర్చూ తప్పదు. అర్హత కలిగిన అమెరికన్లు అందుబాటులో ఉన్నప్పుడు ఏ అమెరికన్ కంపెనీ కూడా ఇంత కష్టపడి హెచ్-1బీ వీసాదారులను నియమించుకోదు కదా’’ అని నితీశ్ కన్నన్ రాసుకొచ్చారు.
అందువల్ల అమెరికన్లకు ఉద్యోగాలు రాకపోతే.. దానికి హెచ్-1బీ ప్రక్రియను నిందించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. సరిపడా ఉద్యోగాలు ఉన్నప్పటికీ.. తమకు ఉపాధి దొరకట్లేదని చెప్పడం పనికిరాని మనస్తత్వం అని విమర్శించారు. ఇలా చెప్పడం వల్ల చాలా మంది తనపై ట్రోల్ చేస్తున్నారని నితీశ్ అన్నారు. ఈ దేశం విడిచి వెళ్లిపోవాలని అంటున్నారని తెలిపారు. అయితే, తాను అమెరికాలోనే జన్మించానని, తాను ఈ దేశ పౌరుడినేనంటూ విమర్శకులకు సమాధానమిచ్చారు.














Leave a Reply