
ఇంటర్నెట్ డెస్క్: భారత్ 296 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. రవీంద్ర జడేజా (43; 83 బంతుల్లో) పెవిలియన్ చేరాడు. అసిత ఫెర్నాండో వేసిన 85 ఓవర్లో బంతిని సరిగా అంచనా వేయలేక క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.
టీమ్ఇండియా 281 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. వన్‌డౌన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ (117; 193 బంతుల్లో) ఔటయ్యాడు. కేశర నువాంత బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. 77 ఓవర్లకు భారత్ స్కోరు 287/4. ధ్రువ్ జురెల్ (5), రవీంద్ర జడేజా (36) క్రీజులో ఉన్నారు.
శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో భారత బ్యాటర్ దేవదత్ పడిక్కల్ (100; 168 బంతుల్లో) సెంచరీ బాదాడు. లంకతో తొలి టెస్టులోనూ పడిక్కల్ శతకం బాదిన సంగతి తెలిసిందే. 70 ఓవర్లకు భారత్ స్కోరు 259/3. రవీంద్ర జడేజా (30) పరుగులతో ఉన్నాడు. ఈ జోడీ ఇప్పటివరకు అర్ధ శతక భాగస్వామ్యం నెలకొల్పింది.
భారత బ్యాటర్ రిషభ్ పంత్ (3) రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. లాహిరు కుమార బౌలింగ్‌లో (57.1 ఓవర్) షాట్ ఆడే ప్రయత్నంలో పంత్ ముంజేతికి గాయమైంది. ఫిజియో వచ్చి చికిత్స అందించినా నొప్పి ఎక్కువగా ఉండటంతో పంత్ మైదానాన్ని వీడాడు. రవీంద్ర జడేజా క్రీజులో వచ్చాడు. 58 ఓవర్లకు భారత్ స్కోరు 208/3. జడేజా (1), పడిక్కల్ (78) క్రీజులో ఉన్నారు.
తొలి రోజు ఆటలో మూడో సెషన్ మొదలైంది. ఈ సెషన్ ప్రారంభమైన తర్వాత ఆరు ఓవర్లు జరగ్గా భారత్ 20 పరుగులు చేసింది. 57 ఓవర్లకు స్కోరు 207/3. దేవదత్ పడిక్కల్ (78), రిషభ్ పంత్ (3) పరుగులతో ఉన్నారు.
శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో భారత్ మూడో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (50; 108 బంతుల్లో) పెవిలియన్ చేరాడు. అసిత ఫెర్నాండో వేసిన 52 ఓవర్లో నిరోషన్ డిక్వెల్లాకు క్యాచ్ ఇచ్చాడు. దీంతో పడిక్కల్, గిల్ 120 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఈ క్రమంలోనే తొలి రోజు ఆటలో టీ విరామం ప్రకటించారు. ప్రస్తుతం భారత్ స్కోరు 187/3. దేవదత్ పడిక్కల్ (63)తోపాటు రిషభ్ పంత్ క్రీజులో ఉన్నారు.
శ్రీలంక, భారత్ మధ్య రెండో టెస్టులో తొలి రోజు ఆట కొనసాగుతోంది. ప్రస్తుతం రెండో సెషన్ జరుగుతుండగా భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 99 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. గిల్ ఇప్పటివరకు ఆరు ఫోర్లు బాదాడు. 50 ఓవర్లకు టీమ్ఇండియా స్కోరు 184/2. దేవదత్ పడిక్కల్ (61), గిల్ (50) పరుగులతో ఉన్నారు.
భారత ఆటగాడు దేవదత్ పడిక్కల్ (53*) హాఫ్ సెంచరీ సాధించాడు. తొలి టెస్టులో సెంచరీ బాదిన అతడు.. తన ఫామ్‌ను కొనసాగిస్తూ రాణిస్తున్నాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 43 ఓవర్లకు 159/2. మరోవైపు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (40*) కూడా దూకుడుగా కొనసాగిస్తున్నాడు.
భారత ఇన్నింగ్స్ నెమ్మదిగా పుంజుకొంటోంది. ఆరంభంలో ఆచితూచి ఆడిన దేవదత్ పడిక్కల్ (23*), శుభ్‌మన్ గిల్ (33*) క్రమంగా వేగం పెంచారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు అర్ధశతక భాగస్వామ్యం (55) నిర్మించారు. ప్రస్తుతం భారత్ స్కోరు 35 ఓవర్లకు 120/2.
శ్రీలంక బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేస్తున్నారు. దీంతో భారత బ్యాటర్లు ఎలాంటి రిస్క్ తీసుకోకుండా ఆడుతున్నారు. లంచ్ బ్రేక్ తర్వాత ఐదు ఓవర్ల ఆట జరిగింది. ప్రస్తుతం భారత్ స్కోరు 30 ఓవర్లకు 105/2. శుభ్‌మన్ గిల్ (23*), దేవదత్ పడిక్కల్ (18*) మూడో వికెట్‌కు ఇప్పటికి 39 పరుగులు జోడించారు.

రెండో టెస్టు తొలి రోజు మొదటి సెషన్ ఆట ముగిసింది. లంచ్ బ్రేక్ సమయానికి భారత్ స్కోరు 25 ఓవర్లకు 88/2. క్రీజ్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (11*), దేవదత్ పడిక్కల్ (13*) ఉన్నారు. అంతకుముందు ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (45), కేఎల్ రాహుల్ (18) పెవిలియన్‌కు చేరారు. శ్రీలంక బౌలర్లు అసిత, లాహిరు చెరో వికెట్ తీశారు.
యశస్వి జైస్వాల్ – అసిత ఫెర్నాండో మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే, సహచరులు కలగజేసుకొని వెంటనే పరిస్థితిని చక్కదిద్దారు. తన బౌలింగ్‌లో ఔటై పెవిలియన్‌కు వెళ్తోన్న యశస్వి జైస్వాల్ (45)పై అసిత ఫెర్నాండో ఏదో వ్యాఖ్యలు చేశాడు. వెంటనే యశస్వి వెనక్కి వచ్చి అసిత వైపు వెళ్లాడు. అయితే, గొడవ పెద్దది కాకుండా మిగతా ప్లేయర్లు వేగంగా స్పందించారు. ఆ తర్వాత యశస్వి డగౌట్ బాట పట్టాడు.
భారత ఆటగాడు యశస్వి జైస్వాల్ (45) పెవిలియన్‌కు చేరాడు. అసిత ఫెర్నాండో వేసిన 17వ ఓవర్ చివరి బంతికి బౌల్డయ్యాడు. అయితే, ఇదే ఓవర్లో యశస్వి మూడు బౌండరీలు బాదాడు. హాఫ్ సెంచరీ చేసేలా కనిపించిన యశస్వి.. ఆఫ్ సైడ్ షాట్ కొట్టేందుకు ప్రయత్నించాడు. కానీ, బంతి ఎడ్జ్ తీసుకొని వికెట్లను గిరాటేసింది. దీంతో 66 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్‌ను నష్టపోయింది. అనంతరం బ్యాటింగ్‌కు కెప్టెన్ గిల్ వచ్చాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 17 ఓవర్లకు 66/2.
ఆరంభంలో ఆచితూచి ఆడిన కేఎల్ రాహుల్ (18) దూకుడు పెంచే క్రమంలో పెవిలియన్‌కు చేరాడు. లాహిరు కుమార (10.4వ ఓవర్) వేసిన బంతిని ఆఫ్‌సైడ్ షాట్ కొట్టేందుకు ప్రయత్నించిన కేఎల్ వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో 37 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్‌ను నష్టపోయింది. అనంతరం బ్యాటింగ్‌కు దేవదత్ పడిక్కల్ వచ్చాడు. లాహిరు ఓవర్ చివరి బంతికి పడిక్కల్ ఆఫ్‌సైడ్ బంతి కొట్టాడు. కానీ, అక్కడి ఫీల్డర్ క్యాచ్‌ను అందుకోవడంలో ఇబ్బంది పడ్డాడు. దీంతో పడిక్కల్ లైఫ్ దొరికినట్లైంది. ప్రస్తుతం భారత్ స్కోరు 11 ఓవర్లకు 37/1. క్రీజ్‌లో పడిక్కల్‌తోపాటు యశస్వి జైస్వాల్ (19*) ఉన్నాడు.
తొలి సెషన్లో పిచ్ పేసర్లకు కాస్త సహకారం అందిస్తోంది. దీంతో భారత ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (13*), కేఎల్ రాహుల్ (4*) ఆచితూచి ఆడుతున్నారు. ఐదో ఓవర్లో అసిత ఫెర్నాండో వేసిన బంతిని ఆడేందుకు కేఎల్ ప్రయత్నించాడు. కానీ, బంతి ప్యాడ్లను తాకింది. శ్రీలంక ఫీల్డర్లు అప్పీలు చేయగా అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. దీంతో ఆ జట్టు డీఆర్ఎస్ తీసుకుంది. కానీ, సమీక్షలో బంతి వికెట్లను తాకడం లేదని తేలింది. దీంతో లంక ఒక డీఆర్ఎస్ను నష్టపోయింది. ప్రస్తుతం భారత్ స్కోరు 5 ఓవర్లకు 17/0.
శ్రీలంకతో (IND vs SL) టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌పై కన్నేసిన భారత్ టాస్ నెగ్గింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలి టెస్టులో టీమ్ఇండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. ‘‘గాలె పిచ్ కంటే కొలంబో మైదానం కాస్త హార్డ్‌గా ఉంది. తొలుత బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నా. మున్ముందు టర్నింగ్‌కు సహకారం లభించేందుకు అవకాశం ఉంది’’ అని గిల్ పేర్కొన్నాడు.
కుల్దీప్పై వేటు.. సారాంశ్ ఎంట్రీ
భారత టెస్టు క్రికెట్లోకి మరొక ప్లేయర్ అరంగేట్రం చేశాడు. శ్రీలంకతో (india vs Srilanka) రెండో టెస్టులో 33 ఏళ్ల సారాంశ్ జైన్ టెస్టు క్యాప్‌ను అందుకొన్నాడు. అతడికి సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా క్యాప్‌ను అందించాడు. తొలి మ్యాచ్‌లో పెద్దగా ప్రభావం చూపించని కుల్దీప్ యాదవ్‌పై వేటు పడింది. అతడి స్థానంలో సారాంశ్ తుది జట్టులోకి వచ్చాడు. భారత జట్టు అదొక్కటే మార్పు. శ్రీలంక కూడా రెండు ఛేంజెస్ చేసింది. కమిల్ మిశ్రా అరంగేట్రం చేయగా.. చండిమాల్ ప్లేస్‌లో పసిందు సూరియబండారా వచ్చాడు.
తుది జట్లు
భారత్: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, సారాంశ్ జైన్, మానవ్ సుతార్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ
శ్రీలంక: లాహిరు ఉదారా, కమిల్ మిషారా, పసిందు సూరియబండారా, కమిందు మెండిస్, ధనంజయ డిసిల్వా (కెప్టెన్), సోనాల్ దినుష, నిరోషన్ డిక్వెల్లా (వికెట్ కీపర్), కేశర నువాంత, ప్రభాత్ జయసూర్య, లాహిరు కుమార, అసిత ఫెర్నాండో












Leave a Reply