
ఇంటర్నెట్ డెస్క్: కాల్పుల విరమణ కోసం ఇరాన్ చేసిన ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (US President Trump) తిరస్కరించినట్లు తెలుస్తోంది. నవంబరులో అగ్రరాజ్యంలో జరగనున్న మధ్యంతర ఎన్నికల (Midterm Polls) తర్వాత.. టెహ్రాన్‌పై మళ్లీ దాడులు చేసేందుకు సిద్ధమవ్వాలని ట్రంప్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు అమెరికా మీడియా కథనాలు వెల్లడించాయి.
ఇరాన్ ఓడరేవులపై అమెరికా తమ దిగ్బంధనాన్ని ఎత్తివేస్తే.. అందుకు బదులుగా హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవడంతో పాటు అణుచర్చలను పునరుద్ధరిస్తామని టెహ్రాన్ ప్రతిపాదించింది. ఖతార్ మధ్యవర్తుల ద్వారా ఈ శాంతి ప్రణాళిక (Irans peace plan)ను అగ్రరాజ్యానికి తెలియజేశామని.. దీనిపై ఒప్పందం కుదిరితే హర్మూజ్‌ను ఏడు రోజుల్లో తిరిగి తెరుస్తామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే, దీనిపై ట్రంప్ విముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. శాంతి ప్రణాళికకు ఇరాన్ కట్టుబడి ఉంటుందా..? అనే దానిపై అమెరికా అధ్యక్షుడికి పలు సందేహాలు ఉన్నాయని సదరు కథనాలు పేర్కొన్నాయి.
‘ట్రంప్’ జలసంధి..

ఇదిలా ఉండగా.. హర్మూజ్ జలసంధి (Strait of Hormuz)పై పూర్తి నియంత్రణ తమకే ఉందని ట్రంప్ పదే పదే వాదిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో అడుగు ముందుకేసి.. ‘ట్రూత్ సోషల్’లో ఓ పోస్ట్ చేశారు. హర్మూజ్ పేరుకు బదులుగా ‘ట్రంప్ జలసంధి’ అని రాసి ఉన్న మ్యాప్ ఫొటోను షేర్ చేశారు. ప్రస్తుతం హర్మూజ్‌లో అమెరికా దిగ్బంధనంతో పాటు ఇరాన్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. దీంతో నౌకల రాకపోకలకు ఇబ్బంది కొనసాగుతూనే ఉంది. తమ ఆస్తులను విడుదల చేయాలని.. చమురుపై ఆంక్షలను తొలగించి, సైనిక చర్యకు ముగింపు పలకాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. అలా జరిగితే హర్మూజ్‌లో స్వేచ్ఛా వాణిజ్యానికి అవకాశం లభిస్తుందని చెబుతోంది.












Leave a Reply