
బంగారం ధరల వరుస తగ్గుదల నమోదైంది. గురువారం 10 గ్రాముల 24 క్యారెట్ల రేటు రూ.770 తగ్గి 1,63,130 రూపాయలకు చేరింది. అంతకు ముందు రోజు ఈ రేటు రూ.1,63,900 వద్ద ఉంది. అయితే వెండి మాత్రమే స్థిరంగా ఉండటంతో.. కేజీ సిల్వర్ రేటు రూ.2.60 లక్షల వద్ద నిలిచింది.
రాఖీ పండుగకు ముందు
శుక్రవారం రాఖీ పండుగ జరగనున్న నేపథ్యంలో బంగారం ధరలు తగ్గడం ఆసక్తికరంగా మారింది. సాధారణంగా రాఖీ పండుగ సమయంలో అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లు ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకుంటారు. ఈ సందర్భంగా బంగారం, వెండి ఆభరణాలను కొనుగోలు చేసే వారు కూడా ఉంటారు. అందువల్ల పండుగకు ఒక రోజు ముందు బంగారం ధర తగ్గడం వినియోగదారులకు కొంత ఊరట కలిగించే అంశంగా చెప్పవచ్చు.
బంగారం ధర తగ్గడానికి కారణం
బంగారం ధర తగ్గడానికి ప్రధాన కారణాల్లో అమెరికా డాలర్ బలపడటం ఒకటి. అమెరికాలో అంచనాల కంటే ఎక్కువగా ద్రవ్యోల్బణం నమోదవడంతో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల విషయంలో కఠినంగా వ్యవహరించే అవకాశం ఉందనే అంచనాలు పెరిగాయి. దీంతో అమెరికా డాలర్‌తో పాటు ట్రెజరీ బాండ్ యీల్డ్స్ కూడా పెరిగాయి. సాధారణంగా బాండ్ యీల్డ్స్ పెరిగినప్పుడు వడ్డీ ఆదాయం ఇవ్వని బంగారం ఆకర్షణ కొంత తగ్గుతుంది. ఈ కారణంగానే అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధరపై ఒత్తిడి కనిపించింది.
వెండి మాత్రం స్థిరం
బంగారం తగ్గినప్పటికీ.. దేశీయ మార్కెట్లో వెండి ధర రూ.2,60,000 వద్ద స్థిరంగా కొనసాగింది. ప్రారంభంలో కొంత అమ్మకాల ఒత్తిడి కనిపించినప్పటికీ తర్వాత వెండి ధర నిలదొక్కుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం వెండి కొంత మెరుగైన ప్రదర్శన చేసింది. స్పాట్ సిల్వర్ ధర 0.31 శాతం పెరిగి ఔన్స్‌కు 68.32 డాలర్లకు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి
ప్రపంచ మార్కెట్లో కూడా స్పాట్ గోల్డ్ స్వల్పంగా తగ్గి ఔన్స్‌కు 4,585.88 డాలర్ల వద్ద ట్రేడైంది. అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాల తర్వాత డాలర్ సూచీ బలపడటం, ఫెడ్ వడ్డీ రేట్లపై కఠిన వైఖరి ఉండవచ్చనే అంచనాలు బంగారం ధరను ప్రభావితం చేశాయి. అయితే వెండికి మాత్రం సురక్షిత పెట్టుబడుల కోసం ఉన్న డిమాండ్ కొంత మద్దతు ఇచ్చింది. అందుకే అంతర్జాతీయ మార్కెట్లో వెండి బంగారం కంటే మెరుగ్గా నిలిచింది.
కెవిన్ వార్ష్ ప్రసంగంపై మార్కెట్ దృష్టి
ఇప్పుడు పెట్టుబడిదారుల దృష్టి అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్ కెవిన్ వార్ష్ శుక్రవారం చేయనున్న జాక్సన్ హోల్ ప్రసంగంపై ఉంది. వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణంపై ఫెడ్ వైఖరి ఎలా ఉండబోతోందనే విషయంలో ఆయన చేసే వ్యాఖ్యలు మార్కెట్‌కు ముఖ్యమైన సంకేతాలు ఇవ్వవచ్చు. ఫెడ్ కఠినమైన వైఖరిని సూచిస్తే డాలర్, ట్రెజరీ యీల్డ్స్ మరింత బలపడే అవకాశం ఉంది. అప్పుడు బంగారం ధరపై మరింత ఒత్తిడి రావచ్చు.













Leave a Reply