
ఇంటర్నెట్ డెస్క్: శ్రీలంకతో టెస్టు సిరీస్‌లో భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja Bowling) ఎక్కువగా నోబాల్స్ సంధించాడు. 2021 నుంచి ఇప్పటి వరకు దాదాపు 85 నో బాల్స్ విసరడం గమనార్హం. ఇటీవలే అరంగేట్రం చేసిన సారాంశ్ జైన్ కూడా కొన్నిసార్లు పాదాన్ని క్రీజ్ బయట పెట్టాడు. ఇదే విషయంపై స్పిన్ కోచ్ సాయిరాజ్ బహుతులే ‘టెస్టుల్లోనూ నో బాల్ వేస్తే ఫ్రీహిట్ ఇస్తే బాగుంటుంది’ అని సరదాగా వ్యాఖ్యానించాడు. ఈ క్రమంలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ ఓ కీలక సూచన చేశారు. ఇలా పదేపదే నోబాల్స్ విసిరిన బౌలర్లపై చర్యలు తీసుకోవాలని.. అదే సమయంలో బౌలింగ్ కోచ్‌నూ బాధ్యుడిని చేయాలని స్పష్టం చేశారు.
‘‘ఇటీవల నో బాల్స్‌ను వేయడంపై చర్చ సాగుతోంది. ఇది అత్యంత కీలక విషయమని గుర్తించాలి. మ్యాచ్ స్వరూపాన్నే మార్చేయగలదు. ఆటగాళ్లు కొన్నింటిని కంట్రోల్ చేయగలరు. బ్యాటర్ అయితే గార్డ్‌ను తీసుకోవడం.. అదే బౌలర్‌గా నో బాల్స్ వేయకుండా ఉండటం. ఇప్పుడున్న కాలంలో ప్రతి దానిని గణించడం జరుగుతుంది. అలాంటప్పుడు బౌలింగ్ క్రీజ్‌ను ఎందుకు దాటాలి. ఈ తప్పిదాలు క్షమించరానివి’’ అని గావస్కర్ (Sunil Gavaskar) వ్యాఖ్యానించారు.
ఫ్రీ హిట్స్ వద్దు
‘‘భారత స్పిన్ బౌలింగ్ కోచ్ సరదాగా ఆ వ్యాఖ్యలు చేశాడు. నో బాల్ వేసిన తర్వాత ఫ్రీ హిట్ అంటే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఉంటుంది. టెస్టులనూ ఆ దారిలోకి తీసుకెళ్లొద్దు. ఇలా చేయడం వల్ల పరుగులు రాబట్టడం బ్యాటర్లకు తేలికగా మారుతుంది. అలా కాకుండా.. ప్రతి నో బాల్‌కు బౌలర్‌కు జరిమానా విధించాలి. ఆ సంఖ్య పెరుగుతూ ఉంటే రెట్టింపు చేయాలి. అదే సమయంలో సగం జరిమానాను బౌలింగ్ కోచ్‌కూ విధించాలి. ఆ నిధులను జట్టు డిన్నర్ కోసం కేటాయించాలి. ఇతర అంశాల్లోనూ ఫైన్‌లు వేయాలి. ఫీల్డింగ్ సరిగా చేయకపోయినా కూడా విధించాలి. అందుకోసం ఓటింగ్ పెట్టాలి. ఇలాంటివి జట్టులో ఫన్‌ను తీసుకొస్తాయి. ఆటగాళ్ల మధ్య సఖ్యత పెంచుతాయి’’ అని గావస్కర్ (Gavaskar) సూచించారు.












Leave a Reply