బాబర్‌ ఆజం సంచలన నిర్ణయం! | Pak Captain Babar Azam Returns To Domestic Cricket 1st Time In 7 Years


Pak Captain Babar Azam Returns To Domestic Cricket 1st Time In 7 Years

బాబర్‌ ఆజం (PC: PCB/X)

పాకిస్టాన్‌ టెస్టు క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ బాబర్‌ ఆజం సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఏడేళ్ల తర్వాత తొలిసారి దేశవాళీ రెడ్‌బాల్‌ క్రికెట్‌ బరిలో దిగేందుకు సిద్ధమయ్యాడు. వరుస వైఫల్యాల నేపథ్యంలో అతడు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

అవును.. మా జట్టుకే ఆడుతున్నాడు
ఈ విషయాన్ని ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ డెవలప్‌మెంట్‌ కంపెనీ లిమిటెడ్‌ (OGDCL) స్పోర్ట్స్‌ హెడ్‌ ఫరా ధ్రువీకరించారు. ‘‘బాబర్‌ ఆజం యూకే నుంచి సెప్టెంబరు 16న పాకిస్తాన్‌కు తిరిగి వస్తాడు. ఆ మరుసటి రోజు OGDCL జట్టుతో చేరతాడు. ఇప్పటికే బాబర్‌కు సంబంధించి కిట్‌ ఆర్డర్‌ చేశాము.

ఈ సీజన్‌లో జట్టు ఆడే రెండు, లేదంటే మూడో మ్యాచ్‌ నుంచి బాబర్‌ జట్టుతో ఉంటాడు. ఇది అతడి నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది’’ అని ఫరా తెలిపారు. కాగా ఇంగ్లండ్‌ పర్యటనకు ముందే బాబర్‌ ఆజం మరోసారి పాకిస్తాన్‌ టెస్టు సారథిగా తిరిగి పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే.

గాయంతో మొదలు..
యూకే టూర్‌లో భాగంగా తొలుత కౌంటీ క్లబ్‌ సెలెక్ట్‌ ఎలెవన్‌తో మ్యాచ్‌లో ఆడిన బాబర్‌ ఆజం గాయపడ్డాడు. దీంతో తొలి టెస్టుకు దూరమయ్యాడు. ఇక రెండో టెస్టుతో తిరిగి వచ్చిన బాబర్‌.. దారుణంగా విఫలమయ్యాడు. లార్డ్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో వరుసగా 8, 6 పరుగులు చేశాడు.

వరుస వైఫల్యాల తర్వాత..
ఇక ఆఖరిదైన మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఏడు పరుగులకే అవుటైన బాబర్‌.. రెండో ఇన్నింగ్స్‌తో ఫామ్‌లోకి వచ్చాడు. మొత్తంగా 103 బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌ 76 పరుగులతో రాణించాడు. అయితే, కెప్టెన్‌గా మాత్రం బాబర్‌కు చేదు అనుభవం మిగిలింది.

బాబర్‌ ఆజం సారథ్యంలో ఇంగ్లండ్‌ చేతిలో పాక్‌ 3-0తో వైట్‌వాష్‌ అయింది. అంతేగాక మూడో టెస్టులో స్లో ఓవర్‌రేటు కారణంగా జరిమానాతో పాటు పాయింట్ల కోత (11 పాయింట్లు) ఎదుర్కోవాల్సి వచ్చింది. ఫలితంగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌-2027 ఫైనల్‌ రేసు నుంచి పాక్‌ అనధికారికంగా నిష్క్రమించింది.

చివరగా అప్పుడే
ఈ నేపథ్యంలోనే బోర్డు ఆదేశాల మేరకు తిరిగి దేశీ రెడ్‌బాల్‌ క్రికెట్‌ ఆడేందుకు బాబర్‌ ఆజం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ దిగ్గజ బ్యాటర్‌ చివరగా 2019లో క్వైడ్‌ ఈ ఆజం ట్రోఫీ టోర్నీలో భాగంగా సెంట్రల్‌ పంజాబ్‌ సారథిగా వ్యవహరించాడు. నాడు బాబర్‌ కెప్టెన్సీలో సెంట్రల్‌ పంజాబ్‌ టైటిల్‌ గెలిచింది. 

ఇక తాజాగా రీఎంట్రీ ఇస్తున్న బాబర్‌.. ప్రెసిడెంట్స్‌ ట్రోఫీ గ్రేడ్‌ 1 ఫస్ట్‌క్లాస్‌ టోర్నమెంట్లో భాగంగా OGDCL జట్టుకు ఆడతాడు. గెస్ట్‌ ప్లేయర్‌గా అతడు OGDCLతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పాక్‌ మీడియా తెలిపింది. ఇక బాబర్‌ కంటే ముందే పేసర్‌ షాహిన్‌ ఆఫ్రిది, టీ20 కెప్టెన్‌ సల్మాన్‌ ఆఘా దేశీ రెడ్‌బాల్‌ క్రికెట్‌ బరిలో దిగారు.

చదవండి: ‘వైభవ్‌ ఎందుకు ఆడట్లేదని నా భార్య అరిచేసింది’



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *