ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా ఆదిత్య హాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్’. సెప్టెంబర్ 11న వెండితెరపైకి రానున్న ఈ సినిమాలో శివాజీ, వాసుకి ఆనంద్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా మాట్లాడిన ఆయన నేటి ప్రేక్షకుల ఆలోచనా విధానంపై అసహనం వ్యక్తం చేశారు. ఓటీటీలు కేవలం సోమరిపోతుల కోసమేనని, థియేటర్లలో దక్కే అసలైన ఎక్స్‌పీరియన్స్‌ని ఇవి హరిస్తున్నాయని శివాజీ అభిప్రాయపడ్డారు.
* భయపెడుతూనే నవ్వించనున్న రవితేజ… తొలిసారి ‘హారర్ కామెడీ’ బాటలో మాస్ మహారాజా
శివాజీ కెరీర్ సెకండ్ ఇన్నింగ్స్‌కు సరికొత్త ఊపిరిలూదిన వెబ్ సిరీస్ ‘#90s – ఎ మిడిల్ క్లాస్ బయోపిక్’. ఆదిత్య హాసన్ రూపొందించిన ఈ వెబ్ సిరీస్ డిజిటల్ వేదికపై ఎంతటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. అయితే ఈ సిరీస్‌ను నేరుగా థియేటర్లలో విడుదల చేసి ఉంటే బాక్సాఫీస్ వద్ద అలవోకగా రూ. 100 కోట్ల గ్రాస్ వసూలు చేసేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేవలం ఓటీటీకి పరిమితం కావడం వల్ల ఒక భారీ స్థాయి కలెక్షన్ల రికార్డును వెండితెర మిస్సయిందని, మంచి కథలకు థియేటర్లలో దక్కే రెస్పాన్స్ ఎప్పుడూ అద్భుతంగానే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
శివాజీ చేసిన ఈ బోల్డ్ కామెంట్స్‌పై నెట్టింట భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. సినిమా హాలుకు వెళ్లి ఒక సమూహంతో కలిసి వెండితెరపై చిత్రాన్ని చూడటంలో ఉండే ఎమోషన్ ఓటీటీలో ఎప్పటికీ దొరకదని, థియేటర్ వ్యవస్థను కాపాడుకోవాలనే భావనతోనే శివాజీ అంత కఠినంగా మాట్లాడారని పలువురు సినీ ప్రియులు సమర్థిస్తున్నారు. బిగ్ స్క్రీన్ అనుభవాన్ని ప్రమోట్ చేయడంలో తప్పులేదని వారు భావిస్తున్నారు. అయితే మరోవర్గం ఆయన కామెంట్స్‌ని తప్పబడుతున్నారు. పెరిగిన టికెట్ రేట్లు, పాప్‌కార్న్ ధరలు, కుటుంబంతో కలిసి థియేటర్‌కు వెళ్తే అయ్యే భారీ ఖర్చులు సామాన్యుడికి భారంగా మారాయని, పని ఒత్తిడిలో బతికే కుటుంబాలకు ఇంట్లోనే నాణ్యమైన వినోదాన్ని అందిస్తున్న ఓటీటీలను తక్కువ చేసి మాట్లాడటం సరికాదని కొందరు అంటున్నారు. సినిమాని ఎక్కడ చూడాలన్నది పూర్తిగా ప్రేక్షకుల అభిరుచికి సంబంధించినదని, అలాంటిది ఓటీటీ చూసేవాళ్లని సోమరిపోతులుగా అభివర్ణించడం శివాజీ మూర్ఖత్వానికి నిదర్శనమని మండిపడుతున్నారు.
















Leave a Reply