తొలిరోజు 31 సర్వీసుల రాకపోకలు
ఆదివారం అర్ధరాత్రి ఎగిరిన తొలి విమానం

భోగాపురంలోని అంతర్జాతీయ విమానాశ్రయం
ఈనాడు, విజయనగరం: ఉత్తరాంధ్ర ప్రగతికి కీలకమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అత్యాధునిక హంగులతో సిద్ధమైంది. జీఎంఆర్ సంస్థ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ ఎయిర్‌పోర్ట్ సేవలు సోమవారం నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. విశాఖ విమానాశ్రయం నుంచి చిట్టచివరి సర్వీసుగా దిల్లీ విమానం ఆదివారం రాత్రి 10.45 గంటలకు బయల్దేరింది. తర్వాతి నుంచి వాణిజ్యపరమైన సేవలు ఆగిపోయాయి. విశాఖ విమానాశ్రయంలో ఇప్పటివరకు సుమారు వెయ్యి మంది వరకు సిబ్బంది పనిచేయగా.. వీరంతా ఎక్కడ సేవలందిస్తారనే దానిపై స్పష్టత లేదు. ఆదివారం అర్ధరాత్రి నుంచే భోగాపురంలో సర్వీసులు ప్రారంభమయ్యాయి. తొలుత స్కూట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం రాత్రి ఇక్కడి నుంచి సింగపూర్ బయల్దేరింది.
ఇక పూర్తిస్థాయిలో
భోగాపురం విమానాశ్రయం నుంచి హైదరాబాద్, తిరుపతి, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, ముంబయి నగరాలకు సర్వీసులు తిరగనున్నాయి. ఇండిగో, ఎయిర్‌ఇండియా ఎక్స్‌ప్రెస్ లాంటి దేశీయ విమాన సర్వీసులతోపాటు ఎయిర్ ఇండియా, స్కూట్ ఎయిర్‌లైన్స్ ద్వారా సింగపూర్‌కు, ఇండిగో ద్వారా అబుధాబికి కూడా వెళ్లే అవకాశం ఉంది. సోమవారం 31 సర్వీసులు రాకపోకలు సాగించనుండగా వీటిద్వారా సుమారు తొలిరోజు 6-7వేల మంది ప్రయాణించనున్నారు. హైదరాబాద్ నుంచి ఇండిగో సర్వీసు ఉదయం 6:45 గంటలకు భోగాపురం రానుంది. దీనికి జీఎంఆర్ ప్రతినిధులతో పాటు జిల్లా అధికారులు, విమానాశ్రయ సిబ్బంది స్వాగతం పలుకుతారు. ఉదయం 7:30 తర్వాత తొలి విమానం హైదరాబాద్ వెళ్లనుంది. 8 గంటలకు బెంగళూరుకు, 8.20కి దిల్లీకి, 8.50కి హైదరాబాద్‌కు సర్వీసులు బయలుదేరతాయి. విశాఖ నుంచి భోగాపురం రావడానికి 20 విద్యుత్తు బస్సులు నడవనున్నాయి. ఏయే రూట్లలో ఛార్జీలెంతో ఇప్పటికే ప్రకటించారు. భోగాపురం విమానాశ్రయంలో పార్కింగ్ ఛార్జీలను అధికారులు వెల్లడించారు.
రైతులకు విమానయానం
భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి 2,200 మంది రైతులు తమ భూములను ఇవ్వగా వీరికి రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి ఉచిత విమాన ప్రయాణం చేయిస్తానని ప్రకటించింది. సోమవారం ఉదయం కొంతమంది అన్నదాతలకు విమాన ప్రయాణం కల్పించడానికి ఏర్పాట్లుచేసింది. ఏదో ఒక సర్వీసులో 165 మందిని ఎక్కిస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ‘ఈనాడు’కు తెలిపారు. మిగిలినవారిని విడతలవారీగా తీసుకెళతామన్నారు.
వీడలేక వీడ్కోలు

విశాఖపట్నం (కరాస), న్యూస్‌టుడే: విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం వీడ్కోలు వేడుకలు నిర్వహించారు. సిబ్బంది అందరికీ ఆంధ్రప్రదేశ్ ఎయిర్ ట్రావెల్ అసోసియేషన్ (ఏపీఏటీఏ) సభ్యులు మిఠాయి ప్యాకెట్లు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖ నుంచి భోగాపురం వరకు అధిక సంఖ్యలో ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు నడపాలన్నారు. నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో సిటీలాంజ్‌లను ఏర్పాటుచేయాలని జీఎంఆర్ సంస్థను కోరారు. విశాఖ-భోగాపురం మధ్య భవిష్యత్తులో మెట్రో లేదా ర్యాపిడ్ ట్రాన్సిట్ వ్యవస్థ ఏర్పాటుకు ఇప్పటినుంచే ప్రణాళిక రూపొందించాలన్నారు. విశాఖ విమానాశ్రయం నగరానికి అందించిన సేవలను గుర్తుచేసుకుంటూ ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), విమానాశ్రయ డైరెక్టర్లు, విమానయాన సిబ్బంది, భద్రతా సంస్థలు, ఇతర భాగస్వాములకు ఏపీఏటీఏ కృతజ్ఞతలు తెలిపింది.
విశాఖ విమానాశ్రయంలో విమాన సేవలు ఆదివారం రాత్రి నుంచి నిలిచిపోవడంతో ఎన్నో ఏళ్లుగా అక్కడ పనిచేస్తున్న కార్మికులు, సిబ్బంది కన్నీటి పర్యంతమయ్యారు. తమకు విమానాశ్రయంతో ఉన్న అనుబంధాన్ని గుర్తుతెచ్చుకుని భావోద్వేగానికి గురయ్యారు.













Leave a Reply