
Gold, Silver Prices | ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయ విపణిలో బంగారం, వెండి ధరలు దిగొస్తున్నాయి. చమురు మంటలతో నెలకొన్న ద్రవ్యోల్బణ భయాలు, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాలతో ఈ లోహాలకు గిరాకీ తగ్గుతోంది. దీంతో వీటి ధరలు (Gold, Silver Rates) ఒత్తిడికి గురవుతున్నాయి. సోమవారం ఉదయం హైదరాబాద్ విపణిలో 24 క్యారెట్ల మేలిమి 10 గ్రాముల పసిడి ధర (Gold rate in Hyderabad) రూ.1,53,300గా ఉంది. అటు కేజీ వెండి ధర రూ.2.31లక్షలకు తగ్గింది.
అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ (Gold) ధర సోమవారం దాదాపు 2.1శాతం పతనమై.. ఔన్సు ధర 4,199 డాలర్లకు దిగొచ్చింది. బంగారం ధర ఒక రోజులో ఈ స్థాయిలో తగ్గడం సెప్టెంబరు 1 తర్వాత మళ్లీ ఇప్పుడే కావడం గమనార్హం. ఇక, వెండి (Silver) కూడా ఔన్సు ధర 62 డాలర్లకు పడిపోయింది. కమొడిటీ ఎక్స్ఛేంజ్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ (అక్టోబరు డెలివరీ) 10 గ్రాముల ధర రూ.1.48 లక్షలుగా ఉంది. సిల్వర్ ఫ్యూచర్ కేజీ ధర రూ.2.28 లక్షల వద్ద కొనసాగుతోంది.
హర్మూజ్‌ను తెరిచే శాంతి ప్రణాళికను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తిరస్కరించడంతో పశ్చిమాసియా ఉద్రిక్తతలు ఇప్పట్లో తగ్గేలా కన్పించడం లేదు. దీంతో బ్రెంట్ క్రూడ్ ధర 106 డాలర్లకు చేరుకుంది. ఇదిలానే కొనసాగితే.. ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు, ఇటీవల వడ్డీ రేట్లను పెంచిన అమెరికా ఫెడ్.. అక్టోబరులోనూ మరోమారు పెంపు చేపట్టే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. ఇక, అమెరికా బాండ్ల ప్రతిఫలాలు 5% పైనే ఉన్నాయి. మరోవైపు, అమెరికా డాలర్ సూచీ కూడా 101.39కి పెరిగింది. రెండు నెలల్లో ఇదే గరిష్ఠ స్థాయి కావడం గమనార్హం. ఈ పరిణామాలన్నింటితో బంగారం, వెండిలో పెట్టుబడులకు మదుపర్లు మొగ్గుచూపట్లేదని బులియన్ విశ్లేషకులు చెబుతున్నారు. ఫలితంగా వీటి ధరలు దిగొస్తున్నాయి.












Leave a Reply