
ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లాండ్ చేతిలో మూడు టెస్టుల సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురై స్వదేశంలోనే అభిమానుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న పాకిస్థాన్ (Pakistan) జట్టుకు ఐసీసీ డబుల్ షాక్ ఇచ్చింది. బర్మింగ్‌హామ్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టెస్టులో స్లో ఓవర్ రేట్ కారణంగా పాకిస్థాన్ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో భారీ కోత విధించింది. నిర్ణీత సమయంలోపు పాకిస్థాన్ 11 ఓవర్లు తక్కువగా వేసింది. దీంతో ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధిస్తూ ఐసీసీ (ICC) ఎలైట్ ప్యానెల్‌కు చెందిన మ్యాచ్ రిఫరీ రంజన్ మదుగల్లె నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ప్రస్తుత డబ్ల్యూటీసీలో పాక్‌కు 11 పాయింట్లు కోత విధించారు. దీంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో పాక్ అట్టడుగుకు (తొమ్మిదో స్థానం) పడిపోయింది. ప్రస్తుతం ఆ జట్టు పాయింట్ల శాతం 4.63 మాత్రమే.
ఐసీసీ ప్రవర్తనా నియామవళిలోని ఆర్టికల్ 16.11.12 ప్రకారం డబ్ల్యూటీసీలో నిర్ణీత సమయంలో అవసరమైన రేటు కంటే తక్కువగా వేసిన ప్రతి ఓవర్‌కు ఒక ఛాంపియన్‌షిప్ పాయింట్‌ను జట్టు కోల్పోతుంది. ఆర్టికల్ 2.22 ప్రకారం ఒక్కో స్లో ఓవర్‌కు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో ఐదు శాతం కోత విధిస్తారు. మొత్తం పెనాల్టీని గరిష్ఠంగా 50 శాతానికి పరిమితం చేస్తారు. ఈ లెక్కనే ప్రస్తుతం పాక్ ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజులో కోత విధించారు.












Leave a Reply