
‘‘హిందీలో రాజ్‌కుమార్ హిరాణీ చిత్రాలు చూస్తే భావోద్వేగంతో కన్నీళ్లు వచ్చేస్తాయి. తెలుగులో అలాంటి భావోద్వేగానికి గురి చేసిన సినిమా ‘ఇరుముడి’’ అన్నారు కథానాయకుడు రవితేజ. ఆయన.. ప్రియా భవానీ శంకర్ జంటగా నటించిన ఈ సినిమాని శివ నిర్వాణ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. బేబీ నక్షత్ర, సాయికుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఇటీవల విడుదలై విజయవంతంగా నడుస్తోంది. సోమవారం హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్‌ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా హీరో రవితేజ మాట్లాడుతూ.. ‘‘కరోనా సమయంలో ఓటీటీలో తమిళ, మలయాళ సినిమాలు చూసి.. ఇలాంటి కథలు మనకు రావేంటని అనుకునేవాళ్లం. ఇప్పుడీ చిత్రం ఆ మూలాలున్న కథతోనే వచ్చింది. నిజానికి నాది రాతి గుండె. నాకు సాధారణంగా ఏడుపు రాదు. అలాంటిది ఈ చిత్రం చూసి ఏడ్చేశాను. శివ నాకు ఈ కథ, త్రినాథ్ పాత్ర చెప్పి.. టైటిల్ వినిపించగానే సూపర్ అన్నా. ఇలాంటి మంచి ఫీల్ ఉన్న సినిమాని ప్రేక్షకులకు అందించినందుకు తనకు అభినందనలు. జీవీ ప్రకాశ్ సంగీతం ఈ చిత్రానికి ఆత్మ. ఈ సినిమా చూస్తున్నప్పుడు ఆ మ్యూజిక్‌తో అప్రయత్నంగా ప్రేక్షకులకు కళ్లలో నీళ్లు వచ్చేస్తున్నాయి. వాళ్ల స్పందన చూస్తుంటే నా కళ్లు చెమర్చాయి. మా అమ్మాయి మోక్ష కూడా ఈ చిత్రం చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంది. ఎప్పుడో 20ఏళ్ల క్రితం థియేటర్‌కి వచ్చిన వాళ్లు మళ్లీ ఈ సినిమా చూడటానికి థియేటర్‌కి రావడం కూడా చాలా భావోద్వేగానికి గురి చేసింది. నిజంగా ఈ ఆనందం మామూలుది కాదు’’ అన్నారు.
‘‘నిన్ను కోరి’, ‘మజిలి’ నన్ను తెలుగు వారి ఇళ్లలోకి తీసుకెళ్తే.. ఈ ‘ఇరుముడి’ నన్ను వాళ్ల హృదయాల్లోకి తీసుకెళ్లింది. ఈ చిత్రం కోసం మేమంతా ఒక యుద్ధంలా పని చేశాం. సమష్ఠి కృషి వల్లే ఇంతటి విజయం సాధ్యమైంది. దర్శకుడికి హీరో స్వాతంత్య్రం ఇస్తే ఇలాంటి మంచి చిత్రాలు వస్తాయి. ఈ సినిమాలో ఇంటర్వెల్‌కి ముందు రవితేజని కొడతారు. ‘నన్ను కొడితే అభిమానులు ఒప్పుకుంటారా’ అని ఆయన అనుంటే ఇలాంటి చిత్రం వచ్చేది కాదు. మేము కథ చెప్పేటప్పుడు ఎలాంటి లెక్కలేసుకోలేదు. ప్రేక్షకుడికి కథని కనెక్ట్ చేయాలన్న ఉద్దేశంతో పని చేశాం. దీంట్లో మణెమ్మ పాత్రలో నక్షత్ర ఎంతలా జీవించిందో ప్రేక్షకుల రియాక్షన్స్ చెప్తున్నాయి. అలాగే కావేరి పాత్రని ప్రియా చాలా సహజంగా చేసింది’’ అన్నారు దర్శకుడు శివ నిర్వాణ.
నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ మాట్లాడుతూ.. ‘‘ఒక సినిమా విడుదలైన రోజున్నరలోనే లాభాల్లోకి రావడం గత 50ఏళ్లలో ఎప్పుడూ జరగలేదని డిస్ట్రిబ్యూటర్లు చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రాన్ని మేము చేయడం అదృష్టంగా భావిస్తున్నాం. దీనికి ఎదురు లేదు. మరో నాలుగు వారాలు ఇది వెళ్తూనే ఉంటుంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో సాయికుమార్, ప్రియా భవానీ, స్వసిక, విష్ణు శర్మ, అనంత శ్రీరామ్, నక్షత్ర తదితరులు పాల్గొన్నారు.













Leave a Reply