Shubman Gill: 600వ టెస్టుకు నాయకత్వం గర్వంగా ఉంది.. ఆ బెర్తే మా లక్ష్యం: గిల్


ఇంటర్నెట్ డెస్క్‌: శనివారం నుంచి శ్రీలంకతో టీమ్ఇండియా (IND vs SL) తొలి టెస్టు మ్యాచ్‌లో తలపడనుంది. మరోవైపు టెస్టు సారథిగా శుభ్‌మన్ గిల్ సంవత్సర కాలం పూర్తి చేసుకున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో భారత్‌కిది 600వ మ్యాచ్. ఇలాంటి మైలురాయి టెస్టుకు నాయకత్వం వహించనుండటం గర్వంగా ఉందని కెప్టెన్ గిల్ వ్యాఖ్యానించాడు. భారత స్వాతంత్ర్య దినోత్సవం రోజున మ్యాచ్‌ ప్రారంభం కావడం మరింత ప్రత్యేకతను సంతరించుకుంటుందని తెలిపాడు.

‘‘కెప్టెన్‌ పాత్రలో నేను చాలా సౌకర్యంగానే ఉన్నా. ఇప్పుడు శ్రీలంకతో టెస్టు సిరీస్‌లోనూ విజయం సాధించి వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ బెర్తు ఆశలు సజీవంగా ఉంచుకోవడమే మా లక్ష్యం. కనీసం మేం ఏడు టెస్టుల్లో గెలవాల్సిన అవసరం ఉంది. ఇక్కడి నుంచి మొదలుపెడతాం. అంతేకాకుండా స్వాతంత్ర్య దినోత్సవం రోజునే భారత్‌ 600వ టెస్టు మ్యాచ్‌ ఆడుతోంది. ఇలాంటి పోరుకు నాయకత్వం వహించడం గొప్ప గౌరవం’’ అని గిల్ (Shubman Gill) తెలిపాడు. 

సమయం ఇవ్వాలి..

‘‘మెరుగ్గా మారేందుకు ఆటగాళ్లకు తగినంత సమయం ఇవ్వాలి. కొందరికి కాస్త ఎక్కువ టైమ్‌ పడుతుంది. అయినా సరే వారికి మద్దతుగా నిలుస్తాం. మూడో స్థానంలో సాయి సుదర్శన్‌ (Sai Sudharsan) బాగా ఆడాడు. అతడు గాయం కారణంగా దూరం కావాల్సి వచ్చింది. సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ – మేనేజ్‌మెంట్ మధ్య సంబంధాలు సరిగా లేవని వస్తోన్న ఆరోపణలన్నీ అవాస్తవం. మేం అనుకొన్నంత వేగంగా సాయి సుదర్శన్‌ ఇంప్రూవ్ కాలేదు. అయితే, మా స్క్వాడ్‌లోని 15 మందిపై నమ్మకం ఉంది. తుది జట్టు ఎలా ఉంటుందనేది ఇప్పుడే చెప్పలేను. పేసర్ల విషయంలోనూ ఎంపిక కష్టంగా మారింది. గుర్నూర్ బ్రార్ పాత బంతితోనూ అద్భుతంగా బౌలింగ్‌ చేస్తాడు. బౌన్స్‌ను రాబడతాడు. అయితే, ప్రసిద్ధ్ వార్మప్‌ మ్యాచ్‌లో చాలా చక్కగా బంతులేశాడు. సిరాజ్‌తోపాటు (Siraj) మరొక పేసర్‌ ఎవరనేది తేల్చడం కాస్త క్లిష్టమైన నిర్ణయమే. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని ఫైనల్‌ XIను ప్రకటిస్తాం’’ అని శుభ్‌మన్ గిల్ స్పష్టం చేశాడు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *