The Paradise Movie Review: రివ్యూ: ‘ది ప్యారడైజ్‌’.. నాని యాక్షన్‌ థ్రిల్లర్‌ మెప్పించిందా?


the paradise movie review || చిత్రం: ది ప్యారడైజ్‌; నటీనటులు: నాని, కయాదు లోహర్‌, రాఘవ్‌ జుయల్‌ మోహన్‌బాబు, సోనాలి కుల్‌కర్ణి, ఈశ్వ‌రీ రావు, సంపూర్ణేశ్‌బాబు, తనికెళ్ల భరణి, రాజా రవీంద్ర, కీర్తి సురేశ్‌ తదితరులు; సంగీతం: అనిరుధ్‌ రవిచందర్‌; నిర్మాత: సుధాకర్‌ చెరుకూరి; రచన, దర్శకత్వం: శ్రీకాంత్‌ ఓదెల; విడుదల: 24-09-2026

లవర్‌ బాయ్‌గా, పక్కింటి కుర్రాడిగా నాని తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. అతడిలోని మాస్‌ కోణాన్ని కొత్తగా ఆవిష్కరించిన చిత్రం ‘దసరా’. శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో వచ్చిన ఆ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు వీరిద్దరి హిట్‌ కాంబినేషన్‌లో వచ్చిన మరో మాస్‌ యాక్షన్ థ్రిల్లర్‌ ‘ది ప్యారడైజ్’. ట్రైలర్‌ లేకుండా కేవలం కంటెంట్‌ మీద నమ్మకంతో నేరుగా థియేటర్‌లో విడుదలైన (nani paradise release date) ఈ మూవీ ఎలా ఉంది? ‘జడల్‌’గా నాని మాస్‌ అవతార్‌ మెప్పించిందా? మోహన్‌బాబు విలనిజం సినిమాకు ఎలాంటి బలాన్ని ఇచ్చింది?

కథేంటంటే..

The Paradise Movie Story Telugu || రెండు వేల కిలోమీటర్లు నడిచొచ్చి ప్యారడైజ్ దగ్గర స్థిరపడిన ఏడు వేల మందితో కూడిన ఓ జాతి పేరే సవారీలు. దేశం కోసం పోరాడిన కుటుంబాలు అందులో ఉన్నప్పటికీ ప్రభుత్వ రికార్డుల్లో మాత్రం ఎవ్వరికీ గుర్తింపు ఉండదు. తరాలుగా ఆ గుర్తింపు కోసమే పోరాటాలు జరుగుతుంటాయి. ఏడు వేల మంది కాస్త ఐదు వేల మందికి తగ్గిపోతారు తప్ప గుర్తింపు మాత్రం దక్కదు. శిఖంజా మాలిక్ (మోహన్‌బాబు) కుటుంబం తరాలుగా సవారీలను చిన్నచూపు చూస్తూ అణగదొక్కుతూ ఉంటుంది. ఎదురు తిరిగిన వాళ్లని చంపేస్తుంది. మాలిక్ కుటుంబానికి భయపడి సవారీలకు సాయం చేయడానికి ఎవ్వరూ ముందుకు రారు. వైద్యం, విద్య, ఉపాధి… ఇలా అన్నింటికీ దూరమవుతారు. గత్యంతరం లేక దొంగతనాలు, సారా తయారీతో బతుకుని కొనసాగిస్తుంటారు. మాలిక్ చిత్రహింసల మధ్యే ఇద్దరు కవలలకు జన్మనిచ్చిన సమ్మక్క (సోనాలి కులకర్ణి) తన కొడుకు జడల్‌ (నాని) సవారీలకు నాయకుడై గుర్తింపుని సాధిస్తాడని ఆశపడుతుంది. కానీ, తల్లి అంటే ఏమాత్రం ఇష్టం లేని జడల్‌.. సవారీలకు నాయకుడు అయ్యాడా?తన జాతికి గుర్తింపు తీసుకొచ్చాడా?అసలు అతనికి జడల్‌ (Jadal paradise) అనే పేరు ఎందుకొచ్చింది?చిన్న వయసులోనే జైలుకు ఎందుకు వెళ్లాడు?తిరిగొచ్చాక ఏం చేశాడు?జడల్‌కు మనసిచ్చిన సుబ్బు (కయాదు లోహార్) ఎవరు?తదితర విషయాల్ని తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.

ఎలా ఉందంటే..

The Paradise Movie Review || ‘ఈ జీవితమంతా పోరాటానిది, వచ్చే జన్మ మనది’ అంటూ తమ జాతి గుర్తింపుకోసమే బతుకుల్ని పణంగా పెట్టిన తల్లీ కొడుకుల కథ ఇది. (Nani Paradise Story Line) కథ, కథనాల్ని పక్కనపెట్టి థియేట్రికల్ అనుభూతిని పంచే అంశాలకు పెద్దపీట వేస్తూ మలిచిన సినిమా ఇది. దృశ్యం, సంగీతం పరంగా తిరుగులేని ప్రభావం చూపిస్తుంది. సవారీల అట్టడుగు జీవితాలకు అద్దం పడుతూ, ప్యారడైజ్ ప్రపంచంలో లీనం చేస్తుంది. ప్రతీ ఫ్రేమ్ ఓ పెయింటింగ్‌లా తెరపై కనిపిస్తుంటుంది. అందుకు దీటుగా అనిరుధ్ పాటలు, నేపథ్య సంగీతం ఉంటాయి. మరోవైపు ఇన్నాళ్లూ నేచురల్ స్టార్‌గా కనిపించి అలరించిన నాని… ఇందులో ‘షేర్ నాని’గా విజృంభణ చేస్తాడు.. జడలు మెలిపెట్టి వీరోచిత విన్యాసాలు చేస్తాడు.. గన్స్‌ పేలుస్తాడు.. పదునెక్కిన కత్తులతో రక్తం ఏరులై పారిస్తాడు.. అడుగడుగునా తలలు గాల్లో ఎగిరి పడుతుంటాయి. మొండేలు అడ్డంగా తెగిపడుతుంటాయి. హై మూమెంట్స్‌తో కూడిన ఈ హంగామా థియేటర్లలో ఈలలు వేయించొచ్చేమో కానీ, కొత్తదనం లేని కథ, ఆసక్తిని రేకెత్తించని కథనాలు మాత్రం నిరాశ పరుస్తాయి. తల్లీకొడుకుల కథ, గుర్తింపు కోసం ఓ సమాజం చేసే పోరాటంలాంటి అంశాలు… పలు సినిమాల మిశ్రమంలా అనిపిస్తుంది. మనసుల్ని కలవర పెట్టేలా హింస, రక్తపాతం కూడిన సన్నివేశాలు అధికం.

సవారీల నేపథ్యాన్ని పరిచయం చేసే సన్నివేశాలతో సినిమా ఆసక్తికరంగానే మొదలవుతుంది. తొలి ఫ్రేమ్ నుంచే కథలోకి తీసుకెళుతుంది. జైల్ ఫైట్‌లోనే… హీరో చిన్ననాటి నేపథ్యాన్ని చూపిస్తూ సాగే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. జడలు, పచ్చబొట్టు వెనక కథని వివరించే సన్నివేశాలు ప్రథమార్ధానికి ప్రధాన ఆకర్షణ. అయితే తొలి అరగంట తర్వాత సినిమా క్రమంగా గాడి తప్పుతుంది. కథానాయకుడు జైలు నుంచి బయట వచ్చిన తర్వాత తెరపై కనిపించే సన్నివేశాలు.. హీరో హీరోయిన్ మధ్య ప్రేమకథ పెద్దగా ప్రభావం చూపించవు. విరామానికి ముందు వచ్చే సన్నివేశాలతో సినిమా మళ్లీ గాడిన పడుతుంది. తల్లీకొడుకులతో ముడిపడిన ఆ సన్నివేశాలు ద్వితీయార్ధంపై ఆసక్తిని రేకెత్తిస్తాయి. జడల్ కోరుకున్నట్టుగా శిఖంజా మాలిక్ (mohan babu paradise look) బయటకు వస్తుండడంతో తదుపరి ఇద్దరి మధ్య ఏం జరుగుతుందా? అనే కుతూహలం పెరుగుతుంది. కానీ, ఆ అంచనాలకు తగ్గట్టుగా మాత్రం సినిమా సాగదు. ఒకే పార్శ్వంతో కూడిన కథ కావడం, కొత్తగా చెప్పడానికి అవకాశం లేకపోవడం ద్వితీయార్ధాన్ని పోరాట సన్నివేశాలతో నింపేసినట్టుగా అనిపిస్తుంది. భార‌తీయుడులో క‌మ‌ల్‌హాస‌న్‌ని గుర్తు చేస్తూ మోహ‌న్‌బాబు చేసే విన్యాసాలు ఏమాత్రం అత‌క‌లేదు.

ఎమ్మెల్యే శంకర్ (ప్రియదర్శి) అంటూ కేసీఆర్‌ను పోలిన పాత్ర రాకతో మళ్లీ తెరపై సందడి మొదలవుతుంది. పతాక సన్నివేశాలు.. ముఖ్యమంత్రి వచ్చే సన్నివేశాలూ ఆకట్టుకుంటాయి. కథకు రియల్ టైమ్ అంశాలతో ముడిపెడుతూ తీర్చిదిద్దిన ఆ సన్నివేశాలే సినిమాకి ప్రధాన ఆకర్షణ. కేసీఆర్ ప్రసంగాల్ని పోలిన సంభాషణలు, ఆయన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఫస్టాఫ్‌లో మోహన్‌బాబు పాత్రని పరిచయం చేసిన తీరు ఎంతో బాగుంది. చివరివరకూ అదే టెంపోను కొనసాగించి ఉంటే ఇంకాస్త బాగుండేది. దృశ్యపరంగా ప్రతీ ఫ్రేమ్ ఆకట్టుకునేలా ఉన్నా, ప్యారడైజ్ సెటప్ చాలా చోట్ల కృత్రిమంగా అనిపిస్తుంటుంది. భావోద్వేగాలు కూడా పెద్దగా పండలేదు. ప్యారడైజ్ అనగానే మనందరికీ బిరియానీనే గుర్తొస్తుంది. సినిమాలోనూ బిరియానీ నేపథ్యంలో చాలా సన్నివేశాలే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఆ వంటకం అంత బాగా కుదరలేదంతే.

ఎవరెలా చేశారంటే..

The Paradise Movie Cast And Crew || జడల్‌ పాత్రలో నాని (Nani) ఆకట్టుకున్నాడు. షేర్ నాని అంటూ తనలోని అసలు సిసలు యాక్షన్ అవతారాన్ని చూపించారు. చాలా సన్నివేశాల్లో చొక్కా విప్పేసి కనిపిస్తారు. ఆ సన్నివేశాలకు తగ్గట్టుగా తనని తాను తీర్చిదిద్దుకున్న విధానం, ఆయన చేసిన పోరాట సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. సంభాషణల విషయంలో ఇంకాస్త శ్రద్ధ తీసుకోవాల్సింది. సుబ్బు పాత్రలో కయాదు లోహార్ (Kayadu Lohar) చుక్కలాంటి అమ్మాయిగా అందంగానే కనిపించింది. హీరో హీరోయిన్ల మధ్య సన్నివేశాల్ని మలిచిన తీరు, సాగే ప్రేమకథ అంతగా పండలేదు. మోహన్‌బాబు (Mohan Babu) ప్రథమార్ధంపై ప్రభావం చూపించారు. ఆయన సంభాషణలు పలికిన తీరు, కనిపించిన విధానం వింటేజ్ మోహన్‌బాబుని గుర్తు చేశాయి. జూనియర్ మాలిక్ పాత్రలో రాఘవ్ జుయ‌ల్ (Raghav Juyal)నటన ఆకట్టుకుంటుంది. సోనాలి కులకర్ణి, ఈశ్వరీ రావు పాత్రలు, వారి నటన మెప్పిస్తాయి. బిరియానీ పాత్రలో సంపూర్ణేశ్ బాబు (sampoornesh babu in paradise) అలరించారు. సాంకేతిక విభాగాల్లో సాయి కెమెరాకు ఎక్కువ మార్కులు పడతాయి. రిచ్ విజువల్స్‌తో ప్రతీ ఫ్రేమ్ ఆకట్టుకుంటుంది.

అనిరుధ్ పాటల విషయంలో (the paradise movie songs) అదరగొట్టాడు. తెరపై ‘ఆయా షేర్‌’, ‘ఏష నాగుల’ (yesha nagula song) పాటలకు థియేటర్‌ ఊగిపోతుంది. అయితే, నేపథ్య సంగీతంతో ప్రభావం చూపించలేకపోయారు. ప్రథమార్ధం పర్వాలేదనిపించినా, ద్వితీయార్ధంలో వట్టి శబ్దాలే ఎక్కువ. దాంతో చాలా చోట్ల సంభాషణలు కూడా అర్థం కావు. ప్రొడక్షన్ డిజైనింగ్ విభాగానికి మాత్రం వందకు వంద మార్కులు పడతాయి. దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల (The Paradise Director) తన విజన్‌కు తగ్గట్టుగా సన్నివేశాల్ని రాజీపడకుండా తెరపై చూపించారు కానీ, కథ కథనాల విషయంలోనే ఆయన కసరత్తులు సరిపోలేదు. కొన్ని సన్నివేశాలపై బలమైన పట్టు ప్రదర్శించారు. చాలాచోట్ల ఆయ‌న ర‌చ‌న పేల‌వంగా సాగింది. రచన విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకుని ఉంటే సినిమా మరో స్థాయిలో ఉండేది. నిర్మాణం ఉన్నతంగా ఉంది.

రాఘవ్‌ జుయెల్‌ - సుమ కలసి ‘ఏష నాగుల’కు స్టెప్పేస్తే...

  • బలాలు
  • + నాని నటన
  • + ప్రథమార్ధం
  • + విజువల్స్, పాటలు
  • బలహీనతలు
  • – కథ, కథనాలు
  • – కొరవడిన భావోద్వేగాలు
  • – మితిమీరిన ర‌క్త‌పాతం
  • చివ‌రిగా: ది ప్యారడైజ్… రక్తపాతంతో హడలెత్తించే జడల్‌ (the paradise movie review)
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *