USA-Iran: అమెరికా-ఇరాన్ మధ్య 3 గంటల సమావేశం వేళ.. హర్మూజ్‌ వద్ద పేలుళ్లు


ఇంటర్నెట్‌డెస్క్‌: ఐక్యరాజ్య సమితి 81వ సర్వ ప్రతినిధి సభ సమావేశం కోసం ఇరాన్ బృందం అమెరికాకు వచ్చింది (USA-Iran). పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో రెండు దేశాల ప్రతినిధులు మూడు గంటల పాటు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హర్మూజ్‌ జలసంధిని తెరిచేందుకు ఇరాన్ కొన్ని షరతులను యూఎస్‌ ముందుంచిందని తెలుస్తోంది.

ఐరాస సమావేశాల్లో భాగంగా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ, అమెరికా అధ్యక్షుడి ప్రత్యేక రాయబారి స్టీవ్‌ విట్కాఫ్ మధ్య  ఈ సమావేశం జరిగింది. అంతర్జాతీయ ఇంధన రవాణాకు కీలకమైన హర్మూజ్‌ జలసంధిని (Strait of Hormuz) తిరిగి తెరిచేందుకు పలు షరతులను అరాగ్చీ అమెరికా ముందు ఉంచారని ఇరాన్ మీడియా వెల్లడించింది. విట్కాఫ్ అభ్యర్థన మేరకే ఈ భేటీ జరిగిందని పేర్కొంది. తమ షరతులను పునరుద్ఘాటించేందుకు ఈ సమావేశానికి హాజరైనట్లు తెలిపింది.

అమెరికా నౌకా దిగ్బంధనాన్ని తక్షణమే ఎత్తివేయాలని, ఫ్రీజ్ చేసిన ఇరాన్ ఆస్తులన్నింటినీ వెంటనే చెల్లించాలని ఈ సందర్భంగా ఇరాన్ డిమాండ్ చేసినట్లు వెల్లడించింది. ఇరాన్ సైనిక కూటములపై జరిగే దాడులను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేసినట్లు చెప్పింది. అమెరికా, ఇరాన్ ప్రతినిధుల మధ్య సమావేశం బాగా జరిగిందని అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) వెల్లడించారు. భవిష్యత్‌లో జరగబోయే సమావేశం కూడా ఇప్పటికే ఖరారు అయిందని చెప్పారు.

హర్మూజ్ సమీపంలో పేలుళ్లు..

ఒకవైపు అమెరికా, ఇరాన్ ప్రతినిధులు భేటీ అయిన వేళ.. హర్మూజ్ సమీపంలో పేలుళ్లు జరిగాయి (Explosions Near Hormuz). ఖేష్మ్ ద్వీపం వద్ద పేలుళ్ల శబ్దాలు వినిపించాయని ఇరాన్ మీడియా వెల్లడించింది. యుద్ధం ప్రారంభమైన దగ్గరి నుంచి ఈ ద్వీపం ఎన్నోసార్లు టార్గెట్‌గా మారింది. ఈసారి నష్ట తీవ్రత ఏస్థాయిలో ఉందో మాత్రం వెల్లడి కాలేదు.

ఇరాన్‌ను తుడిచిపెట్టేస్తానని, వారిని నరకానికి పంపుతానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఐరాస ప్రసంగంలో హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఒప్పందానికి వస్తే గతంకంటే గొప్ప దేశంగా మారుస్తామని పేర్కొన్నారు. ఆ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సమావేశం, హర్మూజ్ వద్ద పేలుళ్లు జరిగాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *