బీజేపీకి వార్నింగ్‌ బెల్స్‌.. సీఎం కుర్చీకే ముప్పు? | PK Bankipur won Alarm bells for BJP in Bihar, Here’s The Details


PK Bankipur won Alarm bells for BJP in Bihar, Here's The Details

బీహార్‌ రాజకీయాల్లో ఒక్క ఉప ఎన్నిక.. ఎన్నో ప్రశ్నలకు తెరతీసింది. మూడు దశాబ్దాలుగా బీజేపీకి కంచుకోటగా ఉన్న బంకీపూర్‌లో ఆ పార్టీని ఓడిస్తూ జన సురాజ్‌ అధినేత ప్రశాంత్‌ కిశోర్‌ సాధించిన విజయం ఇప్పుడు బీజేపీ శిబిరంలో చర్చకు దారితీసింది. మరీ ముఖ్యంగా.. ఈ విజయాన్ని ముందుగానే బీహార్‌ సీఎం సామ్రాట్‌ చౌదరి నాయకత్వంపై రెఫరెండంగా చిత్రీకరించిన పీకే.. ఫలితం వచ్చిన తర్వాత కూడా అదే దూకుడు కొనసాగిస్తున్నారు. దీంతో అసలు టార్గెట్‌ బంకీపూర్‌ సీటా? లేక బీహార్‌లో బీజేపీ నాయకత్వమా? అన్న ప్రశ్నలు మొదలయ్యాయి.

బంకీపూర్‌ అంటే బీజేపీకి సాధారణ నియోజకవర్గం కాదు. 1995 నుంచి వరుసగా ఆ పార్టీ గెలుస్తూ వచ్చిన బలమైన కోట. నితిన్‌ నబీన్‌ ఈ సీటును ఐదుసార్లు గెలిచారు. ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎదిగి రాజ్యసభకు వెళ్లడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. పార్టీకి అంత బలమైన సీటు కావడంతో.. మొదట బీజేపీ వర్గాల్లో ఈ ఎన్నికను పెద్ద సవాలుగా భావించలేదు. పైగా బీజేపీ శిబిరం పోటీని ‘నో కాంటెస్ట్‌’ అన్నంత ధీమాతో చూసింది. కానీ రంగంలోకి దిగిన వ్యక్తి ప్రశాంత్‌ కిశోర్‌. 2025 బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో జన సురాజ్‌ ఒక్క సీటు కూడా గెలవలేకపోయిన పరిస్థితి నుంచి.. తన తొలి ప్రత్యక్ష ఎన్నికల పోరులోనే బీజేపీ కంచుకోటను బద్దలు కొట్టడం రాజకీయంగా పీకేకు భారీ బూస్ట్‌గా మారింది.

అసలు ట్విస్ట్‌ ఇక్కడే..
ఎన్నికలకు ముందే పీకే బంకీపూర్‌ పోరును కేవలం ఎమ్మెల్యే ఎన్నికగా చూడలేదు. సామ్రాట్‌ చౌదరి నాయకత్వంపై రెఫరెండంగా ప్రచారం చేశారు. బీజేపీ గెలిస్తే అది సీఎం నాయకత్వానికి ప్రజల ఆమోదంగా భావించాలని వ్యాఖ్యానించారు. అంటే.. ఎన్నిక ఫలితం తనకు అనుకూలంగా వస్తే దాన్ని నేరుగా సామ్రాట్‌ చౌదరి నాయకత్వానికి వ్యతిరేక తీర్పుగా మలుచుకోవాలన్నది పీకే వ్యూహం. దీంతో, ఇప్పుడు పీకే అడుగులు బంకీపూర్‌ దాటి.. నేరుగా సీఎం వైపు పడుతున్నాయి. ఎన్నికల ఫలితం తర్వాత ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి బీహార్‌కు ‘సామర్థ్యం, సత్ప్రవర్తన ఉన్న’ వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేయాలని ఆయన వ్యాఖ్యానించారు. తాజాగా కూడా సామ్రాట్‌ చౌదరినే రాజకీయంగా టార్గెట్‌ చేస్తూ విమర్శలు కొనసాగిస్తున్నారు.

అయితే ఇక్కడ బీజేపీకి మరో చిక్కు ఉంది. బంకీపూర్‌ ఓటమి కేవలం సీఎం చౌదరికి సంబంధించినదేనా? లేక బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబిన్‌ వ్యక్తిగత కంచుకోట కోల్పోవడమా? అనే ప్రశ్నకు రాజకీయ విశ్లేషకులు రెండో కోణాన్నీ బలంగా ప్రస్తావిస్తున్నారు. ఈ ఓటమి సామ్రాట్‌ కంటే నితిన్‌ నబిన్‌ కుటుంబానికి, మూడు దశాబ్దాలుగా ఆ నియోజకవర్గంపై ఉన్న పట్టు కోల్పోవడానికే ఎక్కువ సంకేతమని అభిప్రాయం వ్యక్తమైంది. ఎందుకంటే బంకీపూర్‌లో గెలిచింది మరో సంప్రదాయ పార్టీ ఆర్జేడీనో లేక కాంగ్రెస్‌ పార్టీనో కాదు. 2025 ఎన్నికల్లో ఖాతా తెరవలేకపోయిన జన సురాజ్‌ పార్టీ. ఆ పార్టీ అధినేతగా పీకే స్వయంగా బరిలోకి దిగి.. బీజేపీకి చెందిన అత్యంత సురక్షితమైన పట్టణ నియోజకవర్గాన్ని చేజిక్కించుకున్నారు. ఇది జన సురాజ్‌కు ఒక సీటు మాత్రమే కాదు.. ‘బీజేపీకి ప్రత్యామ్నాయం కావచ్చు’ అనే రాజకీయ సందేశాన్ని పరీక్షించుకునే తొలి పెద్ద అవకాశంగా మారింది.

ఆర్జేడీకి ఝలక్‌..
మరో ఆసక్తికరమైన పరిణామం ఏమిటంటే.. ఇక్కడ మరో పెద్ద రాజకీయ ట్విస్ట్‌ కూడా ఉంది. పీకే దెబ్బ బీజేపీతోనే ఆగలేదు. బంకీపూర్‌లో ఆర్జేడీ కూడా వెనుకబడింది. ఆ పార్టీ సంప్రదాయ ముస్లిం-యాదవ్‌ ఓటు బ్యాంక్‌లో కొంత భాగం జన సురాజ్‌ వైపు మళ్లిందన్న విశ్లేషణలు వచ్చాయి. ఈ ఓటమి తర్వాత ఆర్జేడీ తన సంస్థాగత వ్యవస్థపై పునర్వ్యవస్థీకరణ చర్యలు చేపట్టడం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. అంటే.. పీకే ఇప్పుడు బీజేపీ, ఆర్జేడీ రెండింటికీ మధ్యలోకి వచ్చి కొత్త రాజకీయ స్థలాన్ని ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

అయితే. పీకే గెలిచింది ఒక సీటు మాత్రమే కావచ్చు.. కానీ ఆయన గెలిచిన చోటు మాత్రం బీజేపీకి అత్యంత బలమైన కోట. ఇప్పుడు ఆ విజయాన్ని పీకే రాష్ట్రవ్యాప్త రాజకీయ ప్రచారంగా మలిస్తే? ఉద్యోగాలు, విద్య, అవినీతి, పాలన వంటి అంశాలతో యువతను ఆకర్షించగలిగితే? సంప్రదాయ కుల సమీకరణాలకు అతీతంగా ఓటర్లను కూడగట్టగలిగితే? అప్పుడు బీహార్‌లో పోటీ కేవలం బీజేపీ వర్సెస్‌ ఆర్జేడీగా ఉండకపోవచ్చు. మూడో శక్తిగా జన సురాజ్‌ ఎదగడం మొదలైతే.. అది ఎన్డీఏకే కాకుండా మొత్తం బీహార్‌ రాజకీయ సమీకరణాలను మార్చే అవకాశం ఉంటుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *