Virat Kohli: ఒకే ఒక్కడు కోహ్లీ.. ఆ రికార్డు బద్దలు కావడం కష్టమే


భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ సెంచరీతో తన సత్తా ఏంటో మరోసారి నిరూపించాడు. సచిన్ రికార్డునే అధిగమించి ఔరా అనిపించాడు. కానీ, ప్రపంచ క్రికెట్‌లో ఎవరికీ అంత త్వరగా దక్కని ఒకే ఒక ఘనత విరాట్ సొంతం. భవిష్యత్తులో మరెవరూ బద్దలు కొట్టే అవకాశం లేని ఆ రికార్డు ఏంటి? ఎందుకు అంత కష్టమో ఓ లుక్కేద్దాం.. 

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో 900+ రేటింగ్‌ను సాధించడమంటే తేలికైన విషయం కాదు. నిరంతరం పరుగులు చేస్తూనే ఉండాలి. తక్కువ కాలంలోనే టీ20 ఫార్మాట్‌లో ఏడుగురు ఈ మార్క్‌ను సాధించారు. ఇందులో ముగ్గురు టీమ్‌ఇండియా నుంచే కావడం గమనార్హం. కానీ, దశాబ్దన్నరకాలం ముందు వరకూ వన్డేలు – టెస్టులే ఎక్కువగా జరిగాయి. ఈ ఫార్మాట్లలో అలరించి.. ఇటు టీ20ల్లోనూ దూకుడుగా ఆడి 900+ రేటింగ్‌ సాధించిన ఏకైక ఆటగాడు విరాట్‌ కోహ్లీనే. కెరీర్‌లో ఇప్పటి వరకు టెస్టుల్లో అత్యధికంగా 937, వన్డేల్లో 911, టీ20ల్లో 909 పాయింట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు వన్డేల్లో అత్యంత వేగంగా 15వేలకుపైగా పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గానూ రికార్డు సృష్టించాడు.

ఎవరైనా సాధించగలరా?

విరాట్ కోహ్లీ (Virat Kohli) తరంలోని ఆటగాళ్లు దాదాపు వీడ్కోలు స్టేజ్‌లో ఉన్నారు. మూడు ఫార్మాట్లలో ఆడేవారే తగ్గిపోయారు. మరి ఇప్పుడు ఉన్న కుర్రాళ్లకు ఏదైనా ఛాన్స్‌ ఉందా? అంటే చెప్పలేని పరిస్థితి. ప్రస్తుతం టీ20ల్లో అభిషేక్ (931), డేవిడ్ మలన్ (919), ఇషాన్ కిషన్ (916), బాబర్ అజామ్ (900) మాత్రమే సాధించారు. కానీ, వన్డేల్లో టాప్‌ ర్యాంకర్‌ అయిన శుభ్‌మన్‌ గిల్ (801) టీ20ల్లో గొప్ప ప్రదర్శన చేయడంలేదు. అతడి రేటింగ్‌ కూడా తక్కువే. ఒకేసారి మూడు ఫార్మాట్లలోనూ రాణిస్తేనే రేటింగ్‌ మెరుగ్గా ఉంటుంది.

మరి 15వేల మైలురాయి ఘనత?

వన్డేల్లో కేవలం ఇద్దరు మాత్రమే 15వేలకుపైగా పరుగులు చేశారు. క్రికెట్ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్ (18,426)తో టాప్ ప్లేస్‌లో ఉన్నారు. ఇక విరాట్ ఖాతాలో 15,080 రన్స్‌ ఉన్నాయి. ఇంకా 3,346 పరుగులు అవసరం. అతడు వచ్చే వరల్డ్ కప్‌ వరకూ ఆడతాడనని అంటున్న క్రమంలో.. 30 వన్డేల్లో మాత్రమే ఆడే అవకాశం ఉంటుంది. అయితే, అత్యధిక ‘శత’ శతకాల రికార్డును బద్దలు కొట్టేందుకు (86) మాత్రం విరాట్‌కు ఛాన్స్‌ ఉంది. ఇక అత్యంత వేగంగా 15వేల పరుగులు చేసిన బ్యాటర్‌ కూడా కోహ్లీనే. 303 ఇన్నింగ్స్‌ల్లోనే సాధించగా.. అందుకు సచిన్‌కు 377 ఇన్నింగ్స్‌లు పట్టాయి. ప్రస్తుతం ఆడుతోన్నవారిలో ఈ దిశగా వచ్చే ప్లేయర్లు దరిదాపుల్లోనే లేరు. ఇప్పటి యువతరం మాత్రమే భవిష్యత్తులో చేయగలరమో చూడాలి.

900+ రేటింగ్‌?

  • ఇప్పటి వరకు కేవలం 9 మంది ప్లేయర్లు మాత్రమే వన్డేలు – టెస్టుల్లో కలిపి 900+ రేటింగ్‌ సాధించారు. 
  • ఇందులో ఐదుగురు బ్యాటర్లు కాగా.. ఇద్దరు ఆల్‌రౌండర్లు, ఇద్దరు ప్రధాన బౌలర్లు.
  • వివ్‌ రిచర్డ్స్‌, ఏబీ విలియర్స్‌, విరాట్ కోహ్లీ, హసీమ్ ఆమ్లా, బ్రియాన్ లారా, ముత్తయ్య మురళీ ధరన్, రిచర్డ్‌ హ్యాడ్లీ, షాన్ పొలాక్, గ్లెన్‌ మెక్‌గ్రాత్‌
  • విండీస్ మాజీ క్రికెటర్ జోయల్ గార్నెర్ ఇప్పటి వరకు వన్డేల్లో అత్యధికంగా రేటింగ్‌ (940 పాయింట్లు) సాధించిన ఆటగాడు. కానీ, అతడు టెస్టుల్లో 900 పాయింట్లకు ఎప్పుడూ చేరుకోలేదు.

– ఇంటర్నెట్ డెస్క్‌



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *